విండీస్‌ విలవిల

Windies prices– 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం
– ఐదు వికెట్లతో చెలరేగిన రేణుక సింగ్‌
వడోదర (గుజరాత్‌): భారత మహిళల జట్టు వన్డే ఫార్మాట్‌లో అతిపెద్ద విజయం నమోదు చేసింది. వడోదరలో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన… ఈ ఫార్మాట్‌లో పరుగుల పరంగా భారత్‌కు అత్యుత్తమ విజయాన్ని అందించింది. పేసర్‌ రేణుక సింగ్‌ (5/29) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగటంతో 315 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్‌ విలవిల్లాడింది. 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ప్రియ మిశ్రా (2/22), దీప్తి శర్మ (1/19), టిటాస్‌ సాదు (1/24) మెరిసినా.. రేణుక సింగ్‌ పదునైన పేస్‌కు విండీస్‌ అమ్మాయిలు తేలిపోయారు. కరీబియన్‌ ఓపెనర్లు మాథ్యూస్‌ (0), జోసెఫ్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించగా.. విలియమ్స్‌ (3), డాటిన్‌ (8), అలెనా (13), శాబిక (3), జైద (9) నిరాశపరిచారు. కాంప్‌బెల్‌ (21), ఫ్లెచర్‌ (24 నాటౌట్‌) పోరాటంతో వెస్టిండీస్‌ వంద పరుగుల మార్క్‌ దాటింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలు 50 ఓవర్లలో 314/9 పరుగులు చేశారు. ఓపెనర్‌ స్మృతీ మంధాన (91, 102 బంతుల్లో 13 ఫోర్లు) భీకర ఫామ్‌ కొనసాగించింది. 13 ఫోర్లతో 91 పరుగులు చేసి తృటిలో శతకం చేజార్చుకుంది. ప్రతిక రావల్‌ (40), హర్లీన్‌ డియోల్‌ (44) సహా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (34), రిచా ఘోష్‌ (26), జెమీమా రొడ్రిగస్‌ (31) వేగంగా పరుగులు సాధించారు. విండీస్‌ బౌలర్లలో జైద (5/45) ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుంది. రేణుక సింగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది. ఈ విజయంతో వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్‌, వెస్టిండీస్‌ మహిళల రెండో వన్డే మంగళవారం ఇదే వేదికపై జరుగనుంది.