– క్యూ3లో 8.4 శాతం వృద్థి
– ఆర్‌బిఐ అంచనాలకు మించిన లెక్కలు
నవతెలంగాణ- బిజినెస్ డెస్క్
మరికొన్ని రోజుల్లో జరగను న్న సార్వత్రిక ఎన్నికలకు ముందు అనుహ్యాంగా జిడిపి అమాంతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రం (2023-24) డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) ఏకంగా 8.4 శాతం పెరిగినట్లు కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఒ) ప్రకటించింది. గురువారం వెల్లడించిన ఈ గణంకాలు ఆర్‌బిఐ అంచనాల కంటే ఎక్కువగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆర్‌బిఐ సహా అనేక అంతర్జాతీయ, జాతీయ ఎజెన్సీలు, విత్త సంస్థలు భారత వృద్థి రేటు 7 శాతం దిగువన ఉండొచ్చని ఇంతక్రితం అంచనా వేశాయి. డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆర్‌బిఐ ఇటీవల పేర్కొంది. ఈ అంచనాలకు భిన్నంగా ప్రధాని మోడీ ప్రభుత్వ గణంకాలు ఉండటం గమనార్హం.
2011-12 స్థిర ధరలతో పోల్చితే గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి విలువ రూ.43.72 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23 ఇదే త్రైమాసికంలో రూ.40.35 లక్షల కోట్లుగా ఉందని.. దీంతో పోల్చితే 8.4 శాతం పెరుగుదల నమోదయ్యిందని ఎన్‌ఎస్‌ఒ వెల్లడించింది. 2023-24లో 7.6 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని ఎన్‌ఎస్‌ఒ తాజా అంచనాల్లో పేర్కొంది. కాగా.. 2022-23లో తొలుత ప్రకటించిన 7 శాతం వృద్థిని.. 7.2 శాతానికి పెంచి సవరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారత జిడిపి 7.8 శాతం, జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.6 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో నిర్మాణ రంగం ఏకంగా 10.7 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు ఎన్‌ఎస్‌ఒ చూపించింది. తయారీ రంగం 8.5 శాతం పెరిగింది. రేటింగ్ ఎజెన్సీలు, దిగ్గజ విత్త సంస్థల పరిశోధన సంస్థల అంచనాను మించి జిడిపి పెరుగుదల చోటు చేసుకోవడం నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గడిచిన క్యూ3లో భారత వృద్థి 6.5 శాతంగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేయగా.. 6.7-6.9 శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్ విశ్లేషించింది. మరోవైపు ఆర్‌బిఐ అంచనాలు 6.5 శాతం మించి ఎన్‌ఎస్‌ఒ అనుహ్యా గణంకాలను ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజల ఆదాయాల్లో పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ.. పెట్టు బడులు, ఆర్థిక వ్యవస్థలో గొప్ప సానుకూలాంశాలు కానరాకపోయినప్పటికీ 8 శాతం ఎగువన జిడిపి పెరగడం విమర్శలకు దారి తీస్తోంది. ఇవి ఎన్నికల ఎత్తుగడ గణంకాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.