– 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం
– 2020, 2022లో రేట్లు పెంచిన అప్పటి సర్కార్
– ప్రతి రెండేండ్లకోసారి పెరుగుదల సహజమంటున్న అధికారులు
– తిరిగి అదే స్థాయిలో పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు
– ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆబ్కారీ శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో పెరగనున్నాయని తెలుస్తోంది. ధరల పెంపుపై ఆబ్కారీ శాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. 2020, 2022లో అప్పటి ప్రభుత్వం 20 నుంచి 25 శాతం వరకు మద్యం ధరలను పెంచింది. తిరిగి రెండేండ్ల తర్వాత అదే స్ధాయిలో ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమ్మకాలతో పాటు ధరల పెంపు ద్వారా ఈ ఏడాది రూ.50వేల కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖ ద్వారా సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర ఖజానా నింపేందుకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి ఆదాయాన్ని సమకూర్చు కునేందుకు సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అదే క్రమంలో లిక్కర్ ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నదని తెలుస్తోంది. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హౌటళ్లు ఉన్నాయి. 2014లో మద్యం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 10,863 కోట్లు సమకూరగా, ఆ తర్వాత ఏడాది రూ.12,706 కోట్ల మార్కును దాటింది. వరుసగా పెరుగుదల రేటును నమోదు చేసుకుంటూ 2022, 23ల్లో రూ.36 వేల కోట్లకు చేరింది. ఈ రకంగా రాష్ట్ర ఖజానాకు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పదేండ్లలో దాదాపు రూ.2.3లక్షల కోట్లకు పైగా ఆబ్కారీ శాఖ నుంచే సర్కార్‌కు ఆదాయం వచ్చింది. అయితే గతేడాది 2022 మార్క్ దాటక పోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. ఈ సారీ ప్రభుత్వం మారడం, సర్కార్ లిక్కర్ ఆదాయంపైనే పెద్దగా ఆశలు పెట్టుకోవడంతో పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. నెలరోజుల్లో మూడు సార్లు అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇతర సిబ్బందితో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఎంత వరకు పెంచాలి? ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? తదితర అంశాలపై ఈ సందర్భంగా అధికారుల నుంచి సైతం ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సర్కార్ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకునేందుకు మద్యం ధరల పెంపుతో పాటు అమ్మకాల్లో 50 శాతం వృద్ధి నమోదు చేయాలని లక్ష్యంగా సర్కార్ సమాయత్తమవుతోందని తెలుస్తోంది.
ఎంత పెంపు?
రాష్ట్రంలో లిక్కర్ ధరలను గత ప్రభుత్వం మార్చి నెలలో పెంచింది. ఈ ఏడాది కూడా మార్చి నెలలోనే పెరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ధరల పెంపుపై అధికారులు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్టు సమాచారం. అన్ని బ్రాండ్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ధరల పెంపు వలన ఏటా ప్రభుత్వానికి అదనంగా రూ.5 నుంచి రూ. 7 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.