విజేత అశ్విని, తనీశ జోడీ గువహటి మాస్టర్స్‌ 100

విజేత అశ్విని, తనీశ జోడీ గువహటి మాస్టర్స్‌ 100గువహటి : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప, తనీశ క్రాస్టో ఎట్టకేలకు ఓ పతకం సాధించారు. మహిళల డబుల్స్‌ విభాగంలో పతక వేటలో వరుస టోర్నీల్లో నిరాశ పరిచిన ఈ జోడీ.. గువహటి మాస్టర్స్‌ 100 టోర్నీలో మెరిసింది. మహిళల డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో చైనీస్‌ తైపీ జోడీ సంగ్‌ యన్‌, చీన్‌ హురు జోడీపై 21-13, 21-19తో మనోళ్లు వరుస గేముల్లో గెలుపొందారు. 40 నిమిషాల్లోనే ముగిసిన టైటిల్‌ ఫైట్‌లో అశ్విని, క్రాస్టో రెచ్చిపోయారు. రెండు గేముల్లోనూ చైనీస్‌ తైపీ జోడీని చిత్తు చేశారు. రెండో గేమ్‌లో అశ్విని, క్రాస్టో నుంచి అనవసర తప్పిదాలు జరిగినా.. గేమ్‌ను చేజారనివ్వలేదు. నెట్‌ వద్ద తనీశ మెరుపు వేగంతో ప్రత్యర్థులపై దండెత్తింది. బ్యాక్‌లో అశ్విని దుమ్మురేపగా.. చైనీస్‌ తైపీ జోడీకి పరాజయం తప్పలేదు. ఇక ఈ విజయంతో అశ్విని, క్రాస్టో మహిళల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో అమాంతం ఎగబాకారు. 28వ స్థానంలోకి వచ్చి.. గాయత్రి, ట్రెసా (వరల్డ్‌ నం.19) తర్వాత ఉత్తమ భారత జోడీగా నిలిచారు.