విజేతలు తక్కువే…!

Winners are few...!– పెరుగుతున్న మహిళా అభ్యర్థుల సంఖ్య
– అయినా లోక్‌సభలో అడుగు పెట్టింది కొద్ది మందే
– ధనబలం, కండబలాన్ని తట్టుకోవడం కష్టమవుతోందన్న నిపుణులు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 1957 ఎన్నికల్లో కేవలం 45 మంది మహిళలు మాత్రమే పోటీ చేయగా గత లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 726కి పెరిగిందని ఎన్నికల కమిషన్‌ వద్ద ఉన్న సమాచారం చెబుతోంది. అదే సమయంలో పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరుగుతోంది. 1957లో పార్లమెంటులో 4.5% మంది మహిళలు మాత్రమే ఉండగా 2019లో వారి ప్రాతినిధ్యం 14.4%కి పెరిగింది. లోక్‌సభకు పోటీ చేస్తున్న పురుష అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. 1957లో 1,457 మంది పోటీపడగా గత ఎన్నికల్లో 7,322 మంది పురుషులు బరిలో నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే పురుష అభ్యర్థుల సంఖ్య ఐదు రెట్లు పెరిగితే మహిళా అభ్యర్థుల సంఖ్య ఏకంగా 16 రెట్లు పెరిగింది. 1957లో లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో కేవలం 2.9% మంది మాత్రమే మహిళలు. 2019లో ఆ సంఖ్య 9%కి పెరిగింది. అయితే మహిళా అభ్యర్థుల సంఖ్య ఇప్పటి వరకూ వెయ్యి దాటకపోవడం గమనార్హం.
పోటీ చేస్తున్నారు కానీ…
1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడిన 45 మంది మహిళా అభ్యర్థుల్లో 22 మంది (48.88%) విజయం సాధించారు. అయితే అప్పటి నుండి మహిళా అభ్యర్థుల్లో విజేతల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 726 మంది మహిళల్లో కేవలం 78 మంది (10.74%) మాత్రమే లోక్‌సభలో అడుగు పెట్టారు. పురుష అభ్యర్థుల విషయానికి వస్తే 1957లో 31.7% మంది గెలుపొందగా గత ఎన్నికల్లో కేవలం 6.4% మంది మాత్రమే విజేతలయ్యారు. పోటీ పడిన వారిలో విజేతలవుతున్న వారి సంగతి పక్కన పెడితే లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్న పురుష, మహిళా అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చట్టసభలో స్థానాలు మాత్రం అప్పటి నుండి అలాగే ఉన్నాయి.
పార్టీల్లో చిత్తశుద్ధి లేదు
గణాంకాలను పరిశీలిస్తే భారతీయ ప్రజాస్వామ్యం పరిణితి చెందుతోందని, మహిళలు అధిక సంఖ్యలో ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారని ‘పొలిటికల్‌ శక్తి’ అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విశ్లేషకుడు తారా కృష్ణస్వామి వ్యాఖ్యానించారు. పోటీ పడుతున్న పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం అధికంగా ఉంటోందని, మహిళలకు పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని నిపుణులు తెలిపారు. మహిళలకు గెలిచే అవకాశాలు అధికంగానే ఉన్నప్పటికీ వారిని పోటీకి నిలిపే విషయంలో రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని మహిళా హక్కుల కార్యకర్త, సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ డైరెక్టర్‌ రంజనా కుమారి అభిప్రాయపడ్డారు.
ఒకవేళ మహిళలకు టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీలు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ వారిని క్లిష్టమైన నియోజకవర్గాల్లో నిలుపుతున్నారని ఆమె చెప్పారు. కండబలం, ధనబలం అధికంగా ఉన్న బలమైన పురుష అభ్యర్థులతో వారు తలపడాల్సి వస్తోందని అంటూ అలాంటప్పుడు అందరికీ సమానావకాశాలు ఎలా లభిస్తాయని ప్రశ్నించారు.