– 17వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆరంభం
హైదరాబాద్ : 17వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ఆరంభమైంది. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ టెన్నిస్ అకాడమీలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ ఆఫ్ జనరల్ సి.వి ఆనంద్‌తో కలిసి హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హెచ్‌ఓటీఏ) అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా క్రీడాకారులు పోటీపడుతున్నారు. పురుషుల ఓపెన్ విభాగంలో 30, 40, 50, 60, 70, 80 ప్లస్ వయో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాల్లో విజేతలకు ఓవరాల్‌గా రూ. 3 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు. ‘దేశవ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడే టోర్నమెంట్‌ను ఏడాదిలో నాలుగుసార్లు నిర్వహిస్తున్న హెచ్‌ఓటీఏకు అభినందనలు. ఈ టోర్నీలో ఇప్పుడు అమెరికా నుంచి సైతం అథ్లెట్లు పోటీపడుతుండటం గొప్ప విషయం’ అని సివి ఆనంద్ అన్నారు. ‘ఎటువంటి లాభాపేక్ష లేకుండా హెచ్‌ఓటీఏ టోర్నీలు నిర్వహిస్తున్నాం. టోర్నమెంట్‌లో పోటీపడే క్రీడాకారులకు జెర్సీతో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని’ నంద్యాల నర్సింహారెడ్డి తెలిపారు. అమెరికా ఎంబసీ నుంచి ఫ్రాంక్, లిండాలు, టోర్నమెంట్ డైరెక్టర్ వాసుదేవ రెడ్డి, హెచ్‌ఓటీఏ ఆఫీస్ బేరర్లు లగ్గాని శ్రీనివాస్, సదాశివ రెడ్డి, రమణ, మెహార్ ప్రకాశ్, చక్రి సహా అధికారిక స్పాన్సర్ టీఏఎన్‌ఎల్‌ఏ గ్రూప్ ఎండీ ఉదరు రెడ్డి తదితరులు టోర్నమెంట్ ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.