– ఆలిండియా పోలీస్ ట్రోఫి విజేతలకు డీజీపీ సత్కారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ చార్మినార్ ట్రోఫిని రాష్ట్ర పోలీసులు కైవసం చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర డీజీపీ డాక్టర్ రవిగుప్తా కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన వారికి డీజీపీ రవిగుప్తా శాలువాలు కప్పి, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు స్పోర్ట్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, ఏఐజీ రమణారావు, పోలీస్ డ్యూటీ మీట్ కోచ్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో రాష్ట్రానికి చెందిన పోలీసులు అన్ని విభాగాల్లో ప్రతిభను కనబర్చి తెలంగాణ ప్రతిష్టను ఇనుమపడింపజేశారని తెలిపారు. వివిధ పోటీల్లో ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు, ఫొటోగ్రఫీలో ఆలిండియా ఛాంపియన్‌షిప్‌ను, వీడియోగ్రఫీలో రన్నర్ సాధించుకోవడం సంతోషకరమని తెలిపారు. పోలీసుల్లో నిగిడీకృతమైన దర్యాప్తు అంశాలను రాటుదేల్చడానికి ఈ పోలీస్ డ్యూటీ మీట్‌లు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని పోలీస్ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది డ్యూటీ మీట్‌లలో మరింత ప్రావీణ్యతను సాధించాలని పిలుపునిచ్చారు.