గెలుపు ఓటములు సహజం..

నవతెలంగాణ – దుబ్బాక: జీవితంలో గెలుపు ఓటములు సహజమని వాటిని తట్టుకొని నిలబడగలిగిన వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ అన్నారు. రన్ ఫర్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం దుబ్బాక పట్టణం నుండి చికోడ్ వరకు 5 కె రన్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీకోడ్ సర్పంచ్ తౌడ శ్రీనివాస్ జండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో సుమారు 200 మంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణ , సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తి జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని డానికి ఔషధంలా పనిచేస్తుందన్నారు. మనిషికి మానసిక దృఢత్వం తో పాటు శారీరక దృఢత్వం అవసరమని ఆరోగ్య పరిరక్షణకు శారీరక దృఢత్వం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యతకు యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని జట్టు స్ఫూర్తితో ముందుకు సాగితే సమాజమంతా ఐక్యంగా ఉంటుందన్నారు. సమాజంలో తారతమ్యాలు లేకుండా సమానత్వ సాధనకు యువత నడుం బిగించాలని కోరారు. ఈ రన్నింగ్ పోటీలలో మొదటి స్థానములో శ్రీనివాస్ రెండవ స్థానంలో స్వామి మూడోవ స్థానంలో భాస్కర్ నిలిచారు. విజేతలకు సీఐ కృష్ణ , సర్పంచ్ శ్రీనివాస్ , ఎస్సై మహేందర్ సిద్దిపేట జిల్లా రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి చేతుల మీదుగా మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రాజు, పరంధాములు, కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, బీఆర్ఎస్ నాయకులు భూమిరెడ్డి, పీఈటిలో, దేవరాజ్ ,రవి శ్రీనివాస్, భాను, చీకోడ్ గ్రామ యువకులు, తదితరులున్నారు.