తేనెటీగల పెంపకంతో

బీబీ అమర్‌జిత్‌ కౌర్‌ చాందీదీదృఢత్వానికి, కృషికి అసలైన చిహ్నం రైతు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని అవిశ్రాంత కృషి చేస్తారు. సాంప్రదాయ వ్యవసాయానికి అతీతంగా.. పశుపోషణ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి రంగాల్లోనూ రైతులు నేడు ముందుకు సాగుతున్నారు. అందులో మహిళా రైతులది ప్రత్యేక పాత్ర. ఇటు కుటుంబ బాధ్యతలు.. అటు వ్యవసాయ పనులు సమతుల్యం చేసుకుంటూ విభిన్న పాత్రలను పోషిస్తుంటారు. బీబీ అమర్‌జిత్‌ కౌర్‌ చాందీదీ అదే కోవ. అంకితభావం, నూతన ఆవిష్కరణ ద్వారా తన జీవితాన్నే కాదు.. అనేక మంది జీవితాలను మార్చిన స్ఫూర్తిదాయకమైన మహిళా రైతు గురించి పరిచయం నేటి మానవిలో…
పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా, బూల్‌పూర్‌ గ్రామంలో స్థిరపడిన చాందీ కుటుంబంలోని వ్యక్తితో బీబీ అమర్‌జిత్‌ కౌర్‌ వివాహం 1993లో జరిగింది. తరతరాలుగా వ్యవసాయంలో నిమగమైన కుటుంబం చాందీలది. కానీ వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు… ఎప్పుడూ నష్టాలే. కాగా, సంగీతంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చేసిన అమర్‌జీత్‌… ఆ రంగంలో ఉద్యోగావకాశాలు సరిగా లేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది.
ప్రారంభం ఇలా..
సవాళ్లు ఎదురవుతున్నా… వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు అమర్‌జిత్‌ మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది. ఈ క్రమంలో తేనెటీగల పెంపకంలో సాధ్యాసాధ్యాలను, లాభనష్టాలను పరిశీలించింది. చేయగలనన్న నమ్మకం, విశ్వాసం ఆమెలో కలిగాయి. ఇంట్లో ఒప్పించి తేనెటీగల పెంపక క్షేత్రాన్ని ప్రారంభించాలనుకుంది. దానికి చాందీ ఫామ్‌గా నామకరణం కూడా చేయాలని నిర్ణయించుకుంది.
తేనెటీగల ప్రపంచంలోకి..
అమర్‌జిత్‌ 1995 మార్చిలో తేనెటీగల పెంపక ప్రపంచంలోకి తొలి అడుగు వేసింది. ‘వ్యవసాయంలో నష్టాలను ఎదుర్కొంటున్న నేను కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టాలంటే తొలుత భయపడ్డాను. కానీ, భర్త ప్రోత్సాహం, సహకారంతో ముందుకు సాగాను. కేవీకే, కపుర్తలాలో నిర్వహించిన వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా తేనెటీగల పెంపకంపై మంచి అవగాహన వచ్చింది. 1995 ఏప్రిల్‌లో ప్రత్యక్ష కార్యాచరణకు దిగాను. మొదట్లో 50 కాలనీలతో ప్రారంభించాను’ అని అమర్‌జిత్‌ గుర్తుచేసుకున్నారు. చాందీ కుటుంబం అప్పటికే పొద్దుతిరుగుడు, ఆవాల సాగులో నిమగమై ఉంది. ‘నాకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాను. అందుకే ఈ తేనెటీగల పెంపకాన్ని ఎంచుకున్నాను..’ అని ఆమె చెప్పింది.
హనీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ టెక్నాలజీ
2013లో.. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘హనీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ టెక్నాలజీ’ని ఇన్‌స్టాల్‌ చేసారు. ఇది వీరు ఉత్పత్తి చేసిన తేనె నాణ్యత, మార్కెట్‌ను గణనీయంగా పెంచింది. దీంతో ఆమె తన ప్లాంట్‌ను మరింత విస్తరించింది. రాణి తేనెటీగల ఉత్పత్తి, రాయల్‌ జెల్లీ, తేనెటీగల పుప్పొడిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వారి ఆదాయాన్ని మరింత పెంచడంలో ఇది ఎంతో తోడ్పడింది. అంతేకాదు.. ఇతర రైతులను సైతం ప్రోత్సహించారు. వీటి పెంపకంలో మెళకువలను వారికి అందించారు. నేడు, వారి తేనెటీగల పెంపక వెంచర్‌ 400 కాలనీలకు పెరిగింది.
స్వయం సహాయక బృందాల ఏర్పాటు
1996లో ఆమె స్వయం సహాయక బృందం ‘చండీ ఉద్యోగ సమితి’ని స్థాపించింది. ఆ తర్వాత 2005లో బేబే నాంకి అనే మరో స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ గ్రూపులు అనేక మందికి ఉపాధి అవకాశాలను అందించాయి. ‘స్వయం-సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లను ఏర్పాటుచేయడం కేవలం వ్యాపారానికే కాదు. ఇది సమాజాన్ని నిర్మించడం, ఉపాధి కల్పించడం, పరస్పర సహకారం కోసం’ అని అమర్‌జిత్‌ అభిప్రాయం. 1996లో మొదటిగా ఎస్‌హెచ్‌జీని స్థాపించిన తర్వాత.. అమర్‌జిత్‌ ఇతర రంగాలపైనా దృష్టిసారించింది. ఊరగాయ తయారీలో శిక్షణ పొందడం ద్వారా తన వ్యాపారాన్ని వైవిధ్యభరితంగా మార్చుకుంది. ఊరగాయలతోపాటు.. పసుపు ఉత్పత్తి, పొడి విక్రయాలనూ మొదలుపెట్టింది. ఇది వారి ఆదాయాన్ని మరింత పెంచింది.
ఇతర రైతులకూ శిక్షణ
అమర్‌జిత్‌ ఇప్పటివరకూ దాదాపు 900 మంది రైతులకు తేనెటీగల పెంపకం, సంబంధిత కార్యకలాపాల్లో శిక్షణ ఇచ్చింది. మా విజయాల్లో రైతులకు శిక్షణ ముఖ్యమైనది. మనం సంపాదించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ పంచాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుంది’ అని అమర్‌జిత్‌ అంటోంది. కృషి విజ్ఞాన కేంద్రం, కపుర్తలా, వ్యవసాయ శాఖ సహకారంతో ఆరు వందలకుపైగా కిసాన్‌ గోష్టిలు, శిక్షణా శిబిరాలను ఆమె నిర్వహించింది.
ఓ వైపు జీవ వైవిద్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూ తన కుటుంబానికి ఆదాయం సమకూర్చటమే కాదు.. పంటలకు ప్రాణం పోస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. బీబీ అమర్‌జిత్‌ కౌర్‌ చాందీ అంకితభావం అనేకమందికి స్ఫూర్తిదాయం. పట్టుదల కృషి ఉంటే సాధించలేనిదేదీ లేదని ఆమె ప్రయాణం మరోసారి రుజువు చేస్తున్నది.
గుర్తింపులు, అవార్డులు
మార్చి 2008లో పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో జరిగిన కిసాన్‌ మేళాలో ముఖ్యమంత్రి అవార్డు, నవంబర్‌ 2018లో న్యూఢిల్లీలోని డీడీ కిసాన్‌ ఛానెల్‌ ద్వారా ‘మహిళా కిసాన్‌ అవార్డు’లు ఆమెను వరించాయి. దీంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.