బీట్‌రూట్ అంటే చాలా మంది అయిష్టత చూపుతారు. కానీ ఇది అందానికీ, ఆరోగ్యానికీ చేసే మేలు గురించి తెలుసుకుంటే మాత్రం వదిలిపెట్టరు. ఈ బీట్‌రూట్‌ను పచ్చిగానే కాకుండా, జ్యూస్‌లా, పచ్చడిలా, జెల్‌లా చేసుకోవచ్చు. వీటిని గారెలుగా వేసుకుని తిన్నా శరీరానికి పోషకాలు అందుతాయి. సో.. ఈ బీట్‌రూట్‌తో చేసుకోగలిగే కొన్ని వంటలు ఈ వారం…
పోషకాలు
ఇందులోని ఇనుము రక్తహీనత రానివ్వకుండా చేస్తుంది. దీన్ని రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తూ అధిక రక్తపోటుని నిలువరిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేయడంలోనూ ఇందులోని పోషకాలు తోడ్పడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
బీట్‌రూట్‌లోని సిలికాన్ ఖనిజం చర్మం తాజాగా కనిపించడానికీ, గోళ్లు, జుట్టు పెరగడంలో కీలకంగా పనిచేస్తుంది. కండరాల సమస్యకు బీట్‌రూట్ చక్కని పరిష్కారం.
కంటి చూపును మెరుగు పరచడంలో దీని పాత్ర కీలకం. బీట్‌రూట్‌తో గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.
గారెలు
కావాలసిన పదార్థాలు : బీట్‌రూట్ తురుము – కప్పు, క్యారెట్ + క్యాబేజీ తురుము – అరకప్పు, శనగపప్పు – రెండున్నర కప్పులు, కందిపప్పు – అరకప్పు, ఉడికిన అన్నం – అరకప్పు, ఎండుమిర్చి – పది, సోంపు – మూడు చెంచాలు, జీలకర్ర – చెంచా, అల్లం తురుము – రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు – అరకప్పు, ఉల్లికాడల తరుగు – అరకప్పు, ఉల్లి తరుగు – ఒక కప్పు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : గోరువెచ్చని నీటిలో పప్పుల్ని రెండు గంటలు నానబెట్టి, నీరు వడకట్టి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో అన్నం, జీలకర్ర మిశ్రమం, రుబ్బిన పప్పులు, బీట్‌రూట్, క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. తర్వాత అరంగుళం మందంగా గారెలు వత్తుకొని నూనెలో వేసుకుని, స్టవ్ మంటను మధ్యస్తంగా పెట్టుకుని దోరగా (లోపల కూడా ఉడికేలా) వేయించుకోవాలి. ఈ గారెలు వేడివేడిగా టమోటా కెచప్‌తో కలిపి తింటే బాగుంటాయి.
పచ్చడి
కావాలసిన పదార్థాలు : మీడియం సైజు బీట్‌రూట్ – ఒకటి, కొబ్బరికోరు- పావు కప్పు, పచ్చిమిర్చి – ఒకటి, అల్లం తురుము – చెంచా, పెరుగు- ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి తగినంత, కొత్తిమీర తరుగు – అలంకరణకు
తాలింపు కోసం : నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు (అన్ని తగిన మోతాదులో)
తయారు చేసే విధానం : బీట్‌రూట్ తొక్క తీసి, పెద్ద ముక్కలుగా కట్ చేసి కొద్దినీటిలో ఒక విజిల్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. ఈలోపు కొబ్బరి కోరు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా రుబ్బుకుని ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టి పక్క నుంచాలి. ఉడికిన బీట్ రూట్ ముక్కల్ని సన్నగా తురిమి, పెరుగు, ఉప్పుతో పాటుగా తాలింపు మిశ్రమంలో కలిపి కొత్తిమీరతో అలంకరించాలి. ఈ పచ్చడి బిర్యానీ రైస్, పరాటాలతో బాగుంటుంది.
జెల్
కావాలసిన పదార్థాలు : మీడియం సైజు బీట్‌రూట్‌లు – రెండు, చెక్కెర – పావు కప్పు, యాలకుల పొడి – అర చెంచా, నీరు – తగినంత.
తయారు చేసే విధానం : బీట్‌రూట్‌లను ఉడికించి, తొక్కతీసి ముక్కలుగా చేసుకుని మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టులో చెక్కెర కలిపి సన్నటి మంటపై దాదాపు 40 నిమిషాలు అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. మరీ ముద్దలా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసుకోవచ్చు. తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి యాలకుల పొడి చల్లాలి. పిల్లలు ఇష్టంగా తినే ఈ జెల్లీ ఫ్రిజ్‌లో వారం రోజుల పాటు నిలువ ఉంటుంది.