– మోడీ జీ దేశ వ్యాప్తంగా కులగణనను ఆపలేరు
– పార్లమెంట్‌లో కులగణన ఆమోదించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తాం
– ‘ఎక్స్’ వేదికగా బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ కౌంటర్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ కుల గణనను ప్రారంభించిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమగ్ర డేటాను ఉపయోగించి రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొంది స్తామని వెల్లడించారు. త్వరలో మహారాష్ట్రలో కూడా ఇదే జరగనుందన్నారు. ఇకపై దేశ వ్యాప్తంగా జరగబోయే కులగణనను మోడీ జీ ఆపలేరన్నారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీ, బీజేపీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదన్న సంగతి ఇప్పటికే ప్రజలందరికీ తెలిసిందని చెప్పారు. ‘నేను మోడీ జీకి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. దేశవ్యాప్తంగా కుల గణనను మీరు ఆపలేరు. త్వరలో పార్లమెంట్‌లోనే కుల గణనను ఆమోదించి… రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిధిని బద్దలు కొడతాం’ అని ట్వీట్ చేశారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణన సర్వే పై కాంగ్రెస్ విడుదల చేసిన హిందీ సాంగ్‌తో కూడిన వీడియోను ఈ ట్వీట్‌కు అటాచ్ చేశారు. ఇందులో తెలంగాణ గవర్నర్ బిష్ణు శర్మ డేటాను సేకరిస్తోన్న అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్గంగా కుల గణన సర్వే జరుగుతోన్న తీరు కనిపించింది.