శీతాకాలంలో అన్నంకు బదులు వేడివేడిగా, స్పైసీగా ఏవైనా తినాలనిపిస్తుంది. రాత్రిపూట చపాతీలు తినేవారు అదే పిండితో పరాటాలు చేసుకోవచ్చు. పరాటాలను వివిధ రకాల స్టఫింగ్‌తో చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది. కొన్నిసార్లు మెంతికూర, కొన్నిసార్లు క్యాబేజీ, కొన్నిసార్లు బంగాళాదుంప, పనీర్ ఇలా ఎన్నో స్టఫింగ్‌లతో పరాటాలను చేసుకోవచ్చు. ఇలా రుచికరమైన పరాటాల్లో కొన్ని నేటి మానవిలో….
జొన్నపిండితో
జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ పేషంట్లు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నవారు రోజుకు ఒకటి రెండు జొన్న రొట్టెలు తింటే శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. రోజూ జొన్న రొట్టెతింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జొన్న రొట్టె అనగానే చాలా మందికి బోర్ కొడుతుంది. కానీ ఈ జొన్న పరాటా చాలా టేస్టీగా వుంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, లేదా రాత్రి డిన్నర్‌లోకి తీసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు : జొన్న పిండి – ఒక కప్పు, గోధుమ పిండి – పావు కప్పు, మెంతి ఆకులు – కట్ చేసినవి ఒక కప్పు, ఉప్పు – రుచికి సరిపడ, దనియాల పొడి – ఒక స్పూన్, కారం – అర స్పూను, పచ్చిమిర్చి పేస్టు – అర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను, జీలకర్ర పొడి – అర స్పూను, పసుపు – పావు స్పూను, నువ్వులు – మూడు స్పూన్లు, పెరుగు – ముప్పావు కప్పు. నూనె – తగినంత.
తయారీ విధానం : ముందుగా జొన్నపిండిని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. పరాటాలు బాగా రావటానికి పావు కప్పు గోధుమపిండిని అందులో కలుపుకోవాలి. పిండిలో ఒక కప్పు కట్ చేసిన మెంతి ఆకులు, లేదా పాలకూర ఆకులను తీసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, దనియాల పొడి, కారం, అర టీస్పూన్ పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. అలాగే అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, పసుపు, మూడు స్పూన్ల నువ్వులను వేసుకోవాలి. నువ్వులతో పరాటాల రుచి మారుతుంది. బౌల్‌లో పిండిని బాగా కలపాలి. ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను నూనెను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని స్మూత్‌గా వచ్చేలా కలుపుకోవాలి. కొంచెం పిండి ముద్దను తీసుకొని గుండ్రంగా చేసుకోవాలి. తరువాత పొడి జొన్నపిండిలో డిప్ చేసి చపాతీలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా, మరీ సన్నగా కాకుండా పరాటాలు ఎలాగైతే చేస్తామో అలాగే రోల్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేసేముందు పరాటాపై కొన్ని నువ్వులను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల పరాటా చూడ్డానికి బాగుండటమే కాకుండా పిల్లలూ ఇష్టంగా తింటారు. పెనంపెట్టి, మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి పరాటాను రెండు పక్కలా కాల్చాలి. రెండు పక్కల నెయ్యిని వేసుకొని జాగ్రత్తగా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ పరాటాను కాల్చుకోవాలి. మిగిలిన మొత్తం పిండిని కూడా ఇలా చేసుకోవాలి. ఇక దీంతో జొన్న పరాటా రెడీ అయినట్టే. పెరుగుతో ఈ పరాటాను సర్వ్ చేసుకోవచ్చు. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికీ మంచిది.
ఉల్లిపాయతో..
కావలసిన పదార్థాలు : గోధుమ పిండి – రెండు కప్పులు, ఉల్లిపాయలు – రెండు, కారం – అర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను, నెయ్యి – నాలుగు స్పూన్లు, పచ్చిమిర్చి – రెండు, చాట్ మసాలా – ఒక స్పూను, కొత్తిమీర తరుగు – ఒక స్పూను, ఉప్పు – రుచికి సరిపడా,
తయారీ విధానం : ఉల్లిపాయ పరాటా చేయడానికి గోధుమపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ పిండిలో ఒక స్పూను ఆయిల్ వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. తర్వాత పిండిని గోరువెచ్చని నీటితో మెత్తగా కలుపుకుని కొద్దిసేపు పిండిని బాగా నాననివ్వాలి. ఈలోపు పరాటా స్టఫింగ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఉల్లిపాయలోని నీటిని చేత్తోనే పిండుకోవాలి. ఆ ఉల్లిపాయలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంటే స్టఫింగ్ రెడీ అయినట్టే.
గోధుమపిండి నుంచి చిన్న ముద్దను తీసి పూరీలా ఒత్తుకోవాలి. మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టి చుట్టూ మూసేసి మళ్లీ పరాటాలా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. అందులో పరాటాలను వేసి కాల్చాలి. రెండు వైపులా రంగు మారేవరకు కాల్చుకోవాలి. అంతే.. రుచికరమైన ఉల్లిపాయ పరాటా రెడీ అయినట్టే. దీన్ని తినేందుకు ఎలాంటి చట్నీ అవసరం లేదు.
ముల్లంగితో
కావలసిన పదార్థాలు : గోధుమపిండి – రెండు కప్పులు, ముల్లంగి తురుము – ఒక కప్పు, నూనె – సరిపడినంత, కొత్తిమీర తురుము – రెండు స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర పొడి – అర స్పూను, దనియాలు పొడి – అర స్పూను, గరం మసాలా – అర స్పూను.
తయారీ విధానం : ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోనే ఉప్పును, నూనెను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముల్లంగిని సన్నగా తురిమి నీళ్లలో వేయాలి. ఆ నీళ్ల నుంచి ముల్లంగి తురుమును తీసి గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ గిన్నెలోనే పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఈ ముల్లంగితో కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమపిండి నుంచి చిన్న ముద్దను తీసి చపాతీలా వత్తి దాని మధ్యలో ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి చపాతీలా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ ముల్లంగి పరోటాను రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ పరోటా రెడీ అయినట్టే. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. కేవలం డయాబెటిస్ పేషంట్లే కాదు ఎవరైనా కూడా దీన్ని తినవచ్చు. ఈ ముల్లంగి పరోటాను చికెన్‌తో తిని చూడండి. రుచి ఎంతో బాగుంటుంది.
మెంతి ఆలూతో..
కావలసిన పదార్థాలు : శనగపిండి – పావు కప్పు మైదా పిండి -రెండు స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు – పావుకిలో, మెంతి ఆకులు – సన్నగా తరిగినవి రెండు కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చిమిర్చి – నాలుగు, కారం – ఒక స్పూను,
తయారీ విధానం : ముందుగా ఓ గిన్నెలోకి కొంచెం శనగపిండి, మరికొంచెం మైదా వేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా కలపాలి. అందులోనే సన్నగా తరిగిన మెంతి ఆకు వేయాలి. సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అలాగే కారం, సాల్ట్‌ను జత చేయాలి.
ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, నెయ్యి లేదా వెన్నను జత చేస్తూ మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు అలానే వదిలేసి, చపాతీల్లా ఒత్తుకోవాలి.
అనంతరం పెనంపై సనన్ని మంటపై రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని పెరుగుతో సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.