లేనిపోని భయాలతో…

With endless fears...శరీరానికైన గాయం బయటకు కనిపిస్తుంది. కానీ మనసుకైన గాయం మాత్రం ఎవరికీ కనిపించదు. దాన్ని అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి గాయానికి ఎలాంటి మందులూ అంత త్వరగా పని చేయవు. ఈ గాయాలు మానాలంటే చాలా సమయం పడుతుంది. అయినా సమస్య పరిష్కారమవుతుందని కచ్చితంగా చెప్పలేము. అలా మనసుకు గాయమైన ఓ వ్యక్తి కథే ఈ వారం ఐద్వా అదాలత్‌…
పల్లవికి 42 ఏండ్లు ఉంటాయి. ఇద్దరు పిల్లలు. భర్త అజరుకి మంచి ఉద్యోగం, ఆర్థికంగా బాగానే ఉన్నారు. పిల్లలు ఉదయం వెళితే సాయంత్రం వస్తారు. ఇంటికి రాగానే ట్యూషన్‌, కోచింగ్‌ అంటూ వెళ్ళిపోతారు. పల్లవి కూడా ఉద్యోగం చేస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజిగా ఉంటారు. ఇంట్లో దేనికీ కొదవలేదు. పల్లవికి ఏమైనా కావాలంటే ఎవరినీ అడగాల్సిన పని లేదు. తనకు ఇష్టమైంది కొనుక్కోవచ్చు. బట్టలు, నగలు ఏవైనా సరే ‘ఎందుకు కొన్నావు’ అని అజరు అడగడు. అతనికి కావల్సినవి కూడా ఆమే తీసుకొస్తుంది.
పెండ్లి, ఫంక్షన్లు ఏమున్నా పల్లవినే గిఫ్టులు తెచ్చి ఇస్తుంది. వీటి కోసం ఎప్పుడూ అజరు దగ్గర డబ్బులు తీసుకోలేదు. అలా తీసుకోవడం ఆమెకు ఇష్టం లేక కాదు. ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది కనుక డబ్బులు ఉన్నాయి. ఇక భర్తను అడగటం ఎందుకని ఆమె ఉద్దేశం. పల్లవి తనకు వచ్చిన జీతం మొత్తం చిట్టీలకు, ఎల్‌.ఐ.సిలకు, ఇంట్లో ఖర్చులకు ఉపయోగించేది. అయితే కరోనా సమమయంలో ఆమెకు ఉద్యోగం పోయింది. దాంతో చేతిలో డబ్బుల్లేవు. ఎలాగో అలా చిట్టీ పూర్తి చేసింది. ఎల్‌.ఐ.సికి ప్రతి ఏడాది రెండు లక్షలు కట్టాలి.
భర్తకు చెబుదామంటే తను ఏమనుకుంటాడో అనే సందేహం. అయితే ఎల్‌.ఐ.సి అజరు కడుతున్నాడు. కానీ ఆమె చేతికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆమే అడగడం లేదు. పిల్లలకు కూడా ఏమీ కొనివ్వలేకపోతుంది. ఈ బాధ ఆమెను నిత్యం ఇబ్బంది పెట్టేది. దాంతో వేరే ఉద్యోగం చూసుకునేందుకు ప్రయత్నించాలనుకుంది. కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి మానసికంగా కుంగిపోతుంది. ఆ ప్రభావమే శరీరంపై పడింది. చిన్న చిన్న పనులు చేసినా అలసిపోతుంది. జ్వరం వచ్చినా ఆస్పత్రికి వెళ్ళడం లేదు.
అజరుని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నానేమో అని నిత్యం ఆలోచించేది. మరీ ఇబ్బంది అయితే అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతుంది. ‘ఖర్చులకు డబ్బు ఎలా, ఎవరిని అడగాలి’ అనే దిగులు రోజురోజుకు పెరిగిపోతోంది. గతంలో తల్లిదండ్రులు, తమ్ముళ్లు, ఆడపడుచులకు అందరికీ ఆమే డబ్బు ఇచ్చేది. అలాంటిది ఇప్పుడు తన పరిస్థితి ఇలా అయ్యిందని బాధపడుతుంది. దాంతో మానసిక ఒత్తిడికి గురయ్యింది. దానికి తోడు అధిక బరువు, థైరాయిడ్‌ కూడా చేరాయి. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంది. దీని వల్ల అజరు తనకు ఎక్కడ దూరమవుతాడో అనే భయం మొదలయింది.
చిన్న చిన్న విషయాలకే ఏడవడం, ఎక్కువ ఆలోచించడం, అరవడం లాంటివి చేస్తుంది. ఒకసారి ఆస్పత్రికి వెళ్ళి తన సమస్యను అజరు ముందే డాక్టర్‌కు చెప్పింది. డాక్టర్‌ ’40 ఏండ్ల తర్వాత హార్మోన్లలో రకరకాల మార్పులు వస్తాయి. దాని వల్లనే మీకు ఇలా అనిపిస్తుంది. నెలసరికి ముందు ఇలా అనిపించడం సహజం. మీ సమస్య ఇంట్లో అందరికీ చెప్పండి. ఇంట్లో వాళ్ళు మీకు సహకరిస్తారు. ముఖ్యంగా అజరు మీరు ఈ సమయంలో ఆమెకు అండగా నిలవాలి’ అని చెప్పి పంపించింది.
రెండు మూడు నెలలు బాగానే ఉన్నారు. కానీ పల్లవిలో మళ్లీ అదే బాధ. ‘నేను డబ్బులు సంపాదించలేక పోవడం వల్ల పిల్లల ముందు, అజరు ముందు తక్కువైపోతానేమో, నన్ను లెక్క చేయరేమో? ఇలాగే ఉంటే నాకంటూ ఎలాంటి గుర్తింపు ఉండదు. వాళ్ళు చెప్పినట్టు నేను చేయాల్సి వుంటుంది’ అని మనసులో ఆలోచిస్తూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లోనే తన సమస్యకు పరిష్కారం చూపమంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము అజరును, పిల్లలను పిలిపించాము. అజరు మాట్లాడుతూ ‘మాకు ఎలాంటి సమస్యా లేదు. ఆమెకు కావల్సినవన్నీ ఇంట్లో ఉంటాయి. ఆమె ఉద్యోగం చేయక పోయినా మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేదు. ఎక్కువగా ఆలోచించి సమస్యలు తెచ్చుకుంటుంది. ఒకసారి డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు మీ దగ్గరకు తీసుకొచ్చింది. నేను ఆమెను ఇష్టపడి పెండ్లి చేసుకున్నాను. అలాంటిది ఆమెను ఎందుకు వదిలిపెడతాను? పల్లవిని నేను ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. అయినా ఆమె ఎందుకు ఇలా అనుకుంటుందో అర్థం కావడం లేదు’ అన్నాడు.
‘మా మమ్మీ ఇప్పుడు ఉద్యోగం చేయకపోయినా మా కోసం అప్పట్లో దాచిపెట్టిన డబ్బు ఉంది. కానీ అది తను వాడుకోవడం లేదు. మాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే మమ్మీ ఉద్యోగం చేసినప్పటి కంటే మాకు ఇప్పుడే బాగుంది. మేము ఇంటికి వచ్చే సరికి తినడానికి ఏదో ఒకటి వేడి వేడిగా చేసి పెడుతుంది. ఇంతకు ముందు కూడా చేసేది కాని పొద్దున్నే చేసి పెట్టి వెళ్ళేది. ఇప్పుడైతే మాతో పాటే మేము తినే వరకు కూర్చుంటుంది. అప్పుడు ఫోన్లో అడిగేది. మాకైతే ఇప్పుడే బాగుంది’ అన్నారు పిల్లలు.
అందరి మాటలు విన్న తర్వాత పల్లవి మానసిక ఒత్తిడితో పాటు, హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతుందని అనిపించి… ‘అజరు మీరు మీ భార్య కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. అలాగే ఆమెకు ఆసక్తి ఉంటే వేరే ఉద్యోగం చూసుకోవడంలో సహకరించండి. ఉద్యోగం లేక, ఖర్చులకు మీపై ఆధారపడుతున్నాననే ఫీలింగ్‌ ఆమెలో బాగా ఉంది. కనుకే మీరే అడిగి మరీ ఆమెకు డబ్బులు ఇవ్వండి. మిమ్మల్ని అడగటానికి ఇబ్బంది పడుతుంది. ఈ విషయం గురించి మేము కూడా ఆమెతో మాట్లాడతాము. దాంతో సగం సమస్య తగ్గిపోతుంది. ఇక పోతే హార్మోన్ల సమస్యకు ఒక సారి మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్ళండి. ఆమెకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. నాలుగు రోజులు పిల్లల్ని తీసుకొని సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి. అప్పుడు కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంది’ అన్నాము. దానికి అతను ఒప్పుకున్నాడు.
పల్లవితో ‘నీకు ఉద్యోగం లేనంత మాత్రానా బాధపడాల్సిన పని లేదు. ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటున్నావు. మీ పిల్లలు కూడా మీతో గడపడానికి ఇష్టపడుతున్నారు. మీ భర్తను డబ్బులు అడగటానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి బాధ్యతలు ఎలా చూస్తున్నారో మీ అవసరాలకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత కూడా అతనికి వుంది. దాన్ని భారం అని ఎవ్వరూ అనుకోరు. ముందు ఆ ఆలోచన మీ మనసులో నుండి తీసెయ్యండి. మీకు చేయ్యాలనిపిస్తే మరో ఉద్యోగానికి ట్రై చేయండి. అజరు కూడా మీకు సహకరిస్తారు. చక్కగా మందులు వాడుతూ, ప్రశాంతంగా ఉండండి. మనసులో లేనిపోని భయాలు పెట్టుకోకండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరంటే చాలా ఇష్టం. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం’ అని ధైర్యం చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి,
9948794051