ఆర్థిక ఇబ్బందులతో..

– నేత కార్మికుడి ఆత్మహత్య
నవతెలంగాణ- తంగళ్ళపల్లి
ఆర్థిక ఇబ్బందులతో ఓ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌ కాలనీలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్‌ కాలనీకి (డబుల్‌ బెడ్రూమ్‌ కాలనీ) చెందిన అంబటి శ్రీధర్‌(24) టెక్స్‌టైల్‌ పార్కులో పనిచేస్తు న్నాడు. కొంతకాలంగా మరమగ్గాలతో చేతినిండా పనిలేకపోవడంతో మూడు నెలల కిందట సిరిసిల్ల పట్టణంలో ఒక హోటల్‌ను అద్దెకు తీసుకొని టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభించాడు. కేసీఆర్‌ కాలనీలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు రావడంతో ప్రతి రోజూ తన తల్లి లక్ష్మితో కలిసి సిరిసిల్లకు వెళ్తూ టిఫిన్‌ సెంటర్‌ కొనసాగించేవాడు. ఒక పూట టిఫిన్‌ సెంటర్‌, మరో పూట నేత కార్మికుడిగా పనిచేసేవాడు. మంగళవారం ఉదయం తల్లితోపాటు సిరిసిల్ల టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన శ్రీధర్‌ మధ్యాహ్నం 2గంటలకు బ్యాంకులో పని ఉందని తల్లిని సిరిసిల్లలో చెల్లెలు ఇంట్లో వదిలి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో శ్రీధర్‌ చెల్లెలు కేసీఆర్‌ కాలనీలోని వారి ఇంటి పొరుగువారికి ఫోన్‌ చేసి ఇంట్లో చూడమని చెప్పింది. వారు ఇంటిని పరిశీలించగా శ్రీధర్‌ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే విషయాన్ని ఆయన చెల్లెలికి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రాణం తీసుకున్నట్టు కుటుంబీకులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.