విశాఖ టెస్టుకు నలుగురు స్పిన్నర్లతో?!

విశాఖ టెస్టుకు నలుగురు స్పిన్నర్లతో?!– ఇంగ్లాండ్‌ చీఫ్‌ కోచ్‌ మెక్‌కలమ్‌ సంకేతం
విశాఖపట్నం : భారత్‌తో హైదరాబాద్‌ టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచిన ఇంగ్లాండ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌.. ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం కానున్న విశాఖ టెస్టులో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టును బెన్‌ స్టోక్స్‌, మెక్‌కలమ్‌ భయమెరుగని ఫార్ములా నడిపిస్తున్నారు. ఈ జోడీ 19 టెస్టుల్లోనే ఏకంగా 14 విజయాలు నమోదు చేసింది. ఓ రేడియో షోలో మాట్లాడుతూ.. అవసరమైతే సిరీస్‌లో రానున్న మ్యాచులకు అందరు స్పిన్నర్లనే తీసుకుంటామని బ్రెండన్‌ వ్యాఖ్యానించాడు. ‘బషీర్‌ ప్రతిభావంతుడైన స్పిన్నర్‌. అబుదాబి క్యాంప్‌లో బాగా ఆకట్టుకున్నాడు. భారత పిచ్‌లపై రాణించగల సత్తా అతడికి ఉంది. భారత్‌తో సిరీస్‌లో రానున్న టెస్టులకు సైతం పిచ్‌లు హైదరాబాద్‌ తరహాలో స్పిన్‌కు అనుకూలిస్తే.. ఇంగ్లాండ్‌ అందరు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు వెనుకడుగు వేయదు’ అని మెక్‌కలమ్‌ అన్నాడు. హైదరాబాద్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ మార్క్‌వుడ్‌ రూపంలో ఒక్క పేసర్‌తోనే ఆడింది. 25 ఓవర్లలో మార్క్‌వుడ్‌ ఒక్క వికెట్‌ తీయలేదు. జాక్‌ లీచ్‌, టామ్‌ హార్టీలీ, రెహాన్‌ అహ్మద్‌లకు తోడు జో రూట్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకున్నాడు. జాక్‌ లీచ్‌ మోకాలి గాయం నుంచి కోలుకుంటే విశాఖ టెస్టులోనే ఇంగ్లాండ్‌ ఆల్‌ స్పిన్‌ బౌలింగ్‌ బృందంతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.