‘విత్‌ అవుట్‌ మేకప్‌’

'విత్‌ అవుట్‌ మేకప్‌'‘మరణానికి ఇది వేకాప్‌ కాల్‌ ‘అంటూ ఎంతో తాత్వికతను నింపే వాక్యాలను రాసి మేకప్‌ల పైకప్పులను ఊడదీసేలా కనువిప్పు కలిగించారు. జీవితానికి ఎన్ని రంగులద్దినట్టు చేసి ముందుకెళ్ళినా ఆత్మసౌందర్యంలేనిది ఏదీ మారదు. ఎక్కడి జీవితం అక్కడనే ఉంటుందన్న స్పృహను కలిగిస్తూ బతుకు మూలుగుతుందని ప్రతీకాత్మకంగా చెప్పారు.
జూకంటి జగన్నాథం గారి కొత్తకవిత ‘మేకప్‌’. శీర్షికలో మేకప్‌ కనబడుతుంది గాని కవితమొత్తం విత్‌ అవుట్‌ మేకప్‌లా వాస్తవానికి దగ్గరగా కనబడుతుంది. ఆధునికతను రంగరించి జీవిత సత్యాలను తెలియజేస్తుంది. రోటీన్‌కు భిన్నంగా సాగిన ఈ కవిత నిర్మాణపరంగా ఓ కొత్త వెలుగు.
మనిషి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని రాసిన కవిత ఇది. మనిషి జీవితం కొన్ని దశలుగా మార్పుచెందుతూ ముందుకు సాగు తుంది. బాల్యం, యవ్వనం,
మధ్యవయసు, వృద్ధా ప్యం అని. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలన్న సామెత కూడా మనకు తెలుసు. కవి ఈ దశల్లోని ఆంతర్యాన్ని అనుభవంతో రంగరించి రాశారు. జీవితానుభవంలోంచి వచ్చిన కవిత ఇది.సాధారణంగా వయసు ప్రస్తావన వచ్చినప్పుడు మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక్క సంవత్సరం ఎక్కువ చెప్పినా ఓర్చుకోలేరు. అంతమాత్రాన వయసు ఆగదు. వచ్చే ఆరోగ్యకరమైన ఇబ్బందులు రాకమానవు. మనల్ని మనం రిఫ్రెష్‌ చేసుకోవాలంటే యంత్రాలము కాము అని హితవు పలుకుతూ స్వచ్ఛమైన, సహజమైన జీవితంలోనే సౌందర్యముందని తెలియజేస్తు న్నారు. ఈ విషయాన్ని కవి ఫ్రేమ్‌లుగా కవిత్వంలోకి పట్టుకొచ్చారు.
ఎత్తుగడలో వయసును దాచటం కోసం వేసే రంగును ప్రస్తావించి నాలోపలి అసలు సౌందర్యాన్ని బయటికి రానివ్వటంలేదని తనను తానే నిందించుకుంటున్నారు. ఈ కవితలో ఒక్కొక్క అంశాన్ని చాలా దగ్గరగా పరిశీలించి రాసినట్టు నిర్మాణంలో కనబడుతుంది.
తలరంగు గురించి ప్రస్తావించిన తర్వాత వెంటనే మీసాలకు వేసేరంగు గురించి, ఆ తర్వాత ముడతలు పడ్డ ముఖానికి వేసే ఫేషియల్‌ గూర్చి, అక్కడ నుంచి మోకాలి నొప్పులతోనో, బలం కోల్పోయో బాధపడుతున్న వృద్ధుల ప్రయాసను కనబడనీయకుండా చేసే కాళ్ళ బూట్లను గూర్చి రాసి జీవితం ఎంత కృత్రిమంగా మారిపోయిందో తెలియజేశారు.
‘మరణానికి ఇది వేకాప్‌ కాల్‌’ అంటూ ఎంతో తాత్వికతను నింపే వాక్యాలను రాసి మేకప్‌ల పైకప్పులను ఊడదీసేలా కనువిప్పు కలిగించారు. జీవితానికి ఎన్ని రంగులద్దినట్టు చేసి ముందుకు వెళ్ళినా ఆత్మ సౌందర్యం లేనిది ఏదీ మారదు. ఎక్కడి జీవితం అక్కడనే ఉంటుందన్న స్పృహను కలిగిస్తూ బతుకు మూలుగుతుందని ప్రతీకాత్మకంగా చెప్పారు.
మనిషికి, యంత్రానికి మధ్య నడుస్తున్న పోటీలో, మనిషి కనిపెట్టిన యంత్రానికి ఉన్న క్రేజీలో, మనిషి యంత్రానికి రిఫ్రెష్‌ బటన్‌ పెట్టి తనను తాను శుభ్రపరిచేలా దానికి సదుపాయాన్ని కల్పించాడు. కానీ తాను ముసుగులో ఉంటూ వాస్తవికతకు దూరంగా జరిగి, హంగులు పొంగులతో వెళ్తూ తాను చేస్తున్న తప్పులను శుభ్రపరిచే బటన్‌ను కనిపెట్టుకోలేక పోతు న్నాడని, మనిషికి, యంత్రానికి ముడిపెట్టి రాసిన ముగింపు వాక్యాలు కవిత్వానికి పట్టుకున్న చెదలును బయటికి నెట్టే యాంటీ వైరస్‌లని చెప్పవచ్చు.నవయవ్వన కవిత్వ పాదాల కవిత ‘మేకప్‌’ ఒక్క మాటలో చెప్పాలంటే రోజూ ఉదయించే సూర్యుడి లాంటిదే.
మేకప్‌
ఇవ్వాళ్ల నెరిసిన జుట్టుకు
నల్లరంగు వేస్తూ
వయసును మోసం చేస్తున్నాను

కోరికలు
తల వాలుస్తున్నప్పుడు
తెల్లని మీసాల కొత్తింటికి
రంగేసి
యవ్వనాన్ని దాస్తున్నాను

మిడతలు మేసిన చేనులా
ముడతలు పడుతున్న ముఖాన్ని
బ్యూటీ పార్లర్‌లో
సరిచేసుకు చర్మం మర్మం తెలియనివ్వను

సొలుగుతున్న అడగులకు
బూట్లు తొడిగి
నడుస్తూ నటిస్తున్నాను
ఇది మేకపే కాదు
మరణ వేకప్‌ కాల్‌ కూడా

ఇంతచేస్తే
నుయ్యిలో పడి
లో గొంతులో
బతుకు మూలుగుతుంది.

కంప్యూటర్‌ కాదు
పొద్దు వాలిన జీవితం
రిఫ్రెష్‌ బటన్‌ నొక్కడానికి
కరప్ట్‌ ఫైళ్ళ దొంతరలను
యాంటీ వైరస్లో
ఉదయంలా శుభ్రపరచడానికి
– జూకంటి జగన్నాథం
– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551