ట్రంప్‌ రాకతో భారత్‌పై అధిక సుంకాల భారం !

– హెచ్చరిస్తున్న వాణిజ్య నిపుణులు
– హెచ్‌-1 బి వీసా నిబంధనల్లో మార్పు ?
– భారత ఐటీ పరిశ్రమకు పెద్ద దెబ్బ
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ అధికారంలోకి రానున్న వేళ భారత ఎగుమతిదారులు అధిక కస్టమ్స్‌ సుంకాలను ఎదుర్కొనే పరిస్థితులు వుండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫస్ట్‌ ఎజెండాను అనుసరించాలని కొత్త ప్రభుత్వం భావిస్తే.. ఆటోమొబైల్స్‌, జౌళి, ఫార్మాస్యూటికల్స్‌ వంటి రంగాల ఉత్పత్తులకు అధిక సుంకాల బెడద తప్పదని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. అలాగే హెచ్‌-1బి వీసా నిబంధనలను కూడా ట్రంప్‌ కట్టుదిట్టం వేస్తారని అంటున్నారు. దీనితో భారత ఐటి సంస్థలకు వ్యయం, అభివృద్ధి వంటి అంశాలు ప్రభావితమవుతాయని పేర్కొంటున్నారు. భారతీయ ఐటి ఎగుమతుల ఆదాయాల్లో 80శాతానికి పైగా మొత్తం అమెరికా నుంచే వస్తుంది. వీసా నిబంధనల్లో మార్పులు వస్తే ముందుగా ప్రభావితమయ్యేది ఈ కంపెనీలే. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వుంది. వార్షిక వాణిజ్యం 19వేల కోట్ల డాలర్లు పైమాటే. చైనాకే కాకుండా, భారత్‌, ఇతర దేశాలకు కూడా టారిఫ్‌లను ట్రంప్‌ పెంచవచ్చని భావిస్తున్నట్టు గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజరు శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. 2020లో భారత్‌ను పెద్ద మొత్తంలో టారిఫ్‌లను దుర్వినియోగం చేసే దేశంగా విమర్శించిన ట్రంప్‌.. టారిఫ్‌ కింగ్‌గా భారత్‌ను అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలు చూస్తుంటే రెండో పదవీ కాలంలో ట్రంప్‌ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ట్రంప్‌ అనుసరించాలనుకుంటున్న ‘అమెరికా ఫస్ట్‌’ అజెండాతో రక్షణాత్మక చర్యలు ఎక్కువవుతాయన్నారు. అయితే చైనా పట్ల అమెరికా కఠిన వైఖరి అనుసరించే అవకాశాలు వుండటంతో భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు కూడా లభ్యమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (ఎంఏజీఏ)’ హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవటంతో వివిధ రంగాల్లో ట్రంప్‌ టారిఫ్‌లను పెంచుతారని కూడా భావించాల్సి వస్తోందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణుడు విశ్వజిత్‌ ధర్‌ చెప్పారు. ట్రంప్‌ అధికారంలోకి రావటంతో రక్షణవాదానికి సంబంధించి భిన్నమైన శకం లోకి ప్రవేశిస్తున్నామన్నారు.