మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెతో..

With the strike of lunch workers..– మధ్యాహ్నం ఇంటి భోజనమే..
– హాస్టల్‌ విద్యార్ధులు 1.5కి.మీ నడిచి హాస్టల్‌కు..
– మీడియా రాకుండా ఆంక్షలు
నవతెలంగాణ-రామారెడ్డి
పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, మెస్‌ చార్జీలు పెంచాలని తమ డిమాండ్ల కోసం మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమ్మెకు వెళ్లగా, విద్యార్థులు ఇంటి నుంచే మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లి భోజనం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని పాఠశాలలో మధాహ్న భోజన కార్మికులు సమ్మెలో ఉండటంతో విద్యార్ధులు ఇంటినుంచే భోజనం తెచ్చుకొని తింటున్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో విద్యార్థుల భోజన దృశ్యాలను తీయకుండా ప్రభుత్వం.. ప్రధానోపాధ్యాయులకు సూచించినట్టు రామారెడ్డి కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు రాజులు తెలిపారు. కాగా, మండలకేంద్రంలోని షెడ్యూల్‌ కులాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. కాగా, వసతి గృహము నుంచి పాఠశాలకు దాదాపు 1.5 కిలోమీటర్‌ దూరం ఉండటం, మధ్యాహ్నం ఒక గంట లోపల నడుచుకుంటూ వెళ్లి, భోజనం చేసి మళ్ళీ తిరిగి రావాలంటే ఇబ్బందిగా ఉందని, సమయం సరిపోవటం లేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహం విద్యార్థులకు భోజనం పాఠశాలలోనే అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాను దూరం ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.