పదవికాలం ముగిసినా..ప్రజలతోనే..

– అందుబాటులో ఉంటూ ఆదర్శంగా మాజీ సర్పంచులు
నవతెలంగాణ – బెజ్జంకి
పదవి కాలం ముగిసినా..నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కరానికి మండలంలోని పలువురు మాజీ సర్పంచులు నేటికి కృషి చేస్తునే ఉన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.గత ఐదేండ్లుగా సర్పంచులుగా కొనసాగి చిత్తశుద్ధిలో గ్రామాలాభివృద్ధికి తోడ్పాటు అందించి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.పదవి కాలం తర్వాత గ్రామాల్లో పరిపాలన బాధ్యతలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.ప్రజల్లో ఉంటూ నేటికి మాజీ సర్పంచులు సేవ చేయడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వారే పాటుపడుతున్న ఈ  రోజుల్లో ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలను మరువకుండా ప్రజా సమస్యలను పలువురు మాజీ సర్పంచులు తమ సమస్యలుగా బావించి పరిష్కారానికి కృషి చేయడం ప్రశంసనీయం. మండలంలోని పలువురు సర్పంచులు బాధ్యతలు చేపట్టిన నుండి నిత్యం ప్రజా సేవలో ఉండేవారని అయా గ్రామాల గ్రామస్తులు చెబుతున్నారు.ఏ సమస్య వచ్చినా..సర్పంచులను కలవగానే పరిష్కారానికి కృషి చేసేవారని గుర్తు చేస్తున్నారు.
అభివృద్ధిలో అయా గ్రామాల ముందడుగు..
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాలాభివృద్ధే ద్యేయంగా మండలంలోని పలువురు సర్పంచులు కృషి చేశారు.రేగులపల్లి, చీలాపూర్,గుండారం,కల్లేపల్లి,లక్ష్మిపూర్,గుగ్గీల్ల,పెరుకబండ,దాచారం,బెజ్జంకి క్రాసింగ్ గ్రామాలు అభివద్ధిలో ముందుకు సాగాయి.అయా గ్రామాల్లోని వార్డుల్లో పూర్తి స్థాయిలో సీసీరోడ్లు,మురికి కాల్వలు నిర్మించారు.మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా సాగుతోంది.స్మశానవాటిక,డంపింగ్‌ యార్డ్‌,పల్లే ప్రకృతి వనం,క్రీడా ప్రాగణం నిర్మించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేయడంతో అయా గ్రామస్తుల మనస్సుల్లో చేరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
ప్రజలకే ప్రథమ ప్రాధాన్యత..
ప్రజలు ఓట్లేసి ఎన్నుకుని గౌరవప్రదమైన పదవిలో కొనసాగే భాగ్యాన్ని కల్పించారు.ప్రతి సర్పంచుకు ప్రజలే ప్రథమ ప్రాధాన్యత.కుటుంబంలో తలెత్తే సమస్యలే ప్రజల్లో తలెత్తుతాయి.కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే విధానంలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కర్తవ్యంగా బావించాను.యాదవ్ సంక్షేమానికి సుమారు రూ.30 లక్షలతో గొర్ల షేడ్ల నిర్మాణం చేపట్టాము.డిల్లీ కేంద్ర ప్రభుత్వ శిక్షణాధికారులు వారం రోజులు గ్రామంలో విడిది చేసి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించారు.ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీగా అందించిన పురస్కారంతో పాటు మరో మూడు  ఉత్తమ సర్పంచ్ పురస్కారాలు రేగుపల్లి గ్రామాన్ని వరించాయి. పదవి ఉన్న లేకున్నా ప్రజల కోసం పని చేయడం సంతృప్తినిస్తుంది. – జెల్లా ఐలయ్య,మాజీ సర్పంచ్,రేగులపల్లి.