ఆర్టీసీ ‘జూనియన్‌ అసిస్టెంట్‌’ నోటిఫికేషన్‌ నిలుపుదల

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలో జూనియన్‌ అసిస్టెంట్‌ క్వాలిఫై పరీక్ష కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను యాజమాన్యం నిలుపుదల చేసింది. ఈ పరీక్షపై అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నోటిఫికేషన్‌లో మార్పులు కోరుతూ టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) కూడా యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించింది. దీనిపై ఆర్టీసీ కార్మికులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈనెల 17న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవగాహనా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. దానికంటే ముందే యాజమాన్యం నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. అయితే భవిష్యత్‌ అవసరాల కోసం ఎస్‌డబ్లూఎఫ్‌ అవగాహనా సమావేశాన్ని యథాతధంగా నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.