సి.డబ్ల్యు.సి (చైల్డ్ వెల్ఫేర్ కమిటి) ఛైర్ పర్సన్‌గా, స్కై స్పెషల్ స్కూల్ (ప్రత్యేక సామర్ధ్యం గల పిల్లల పాఠశాల) నిర్వాహకురాలిగా దశాబ్దాల కాలం విశేష అనుభవమున్న పి.శ్యామలాదేవిగారిని బాలల సంరక్షణ గురించి తెలుపమన్నప్పుడు ఆమె స్పందించిన తీరు..
పిల్లలను మనం స్థూలంగా మూడు దశలుగా వర్గీకరించుకోవాలి. 1. శిశు దశ, 2. బాల్య దశ, 3. కౌమార దశ. రక్షణ పొందే హక్కు బాలల హక్కుల్లో అత్యంత కీలకమైనదిగా భావించాలి.
1. తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్నపటి నుండి పిల్లల సంరక్షణ మొదలవుతుంది. మనదేశంలో ఇప్పటికే వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు గణనీయంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆడుకునే వయసులోనే పెళ్లి చేయడం. వందేళ్ళ క్రితం గురజాడ కాలంలోనే కాదు ఇప్పటికీ జరగడం ఏం నాగరికం? అసలు వివాహం అంటే ఏమిటి? దాంపత్యం ఎలా చేయాలి? పిల్లల్ని ఎలా కనాలి? ఆ శాస్త్రీయ పద్ధతులు ఏమిటి? ఇప్పటికీ ఓ శాస్త్రంగా, బోధనగా మన జీవితాల్లోకి రావడం లేదు. అతి కొద్దిమంది మాత్రమే అవగాహనతో వీటిని పాటిస్తున్నారు. అప్పుడు మాత్రమే వారు మాతృత్వాన్ని తృప్తిగా అనుభవించగలరు. తల్లీ – పిల్ల సంరక్షణగా వుండగలరు. ప్రతి ఒక్క స్త్రీకి ఒక హక్కుగా దక్కవలసిన ఈ సౌకర్యం దక్కదు. ఆ విజ్ఞానం అందదు. ప్రసూతి ముందు, వెనుక పాటించవలసిన సున్నిత విషయాలు మొరటుగా జరగడం పరిపాటైపోయింది. బాలల రక్షణకు విఘాతం అక్కడనుంచే మొదలవుతున్నది. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భంతో వున్న స్త్రీలకు పౌష్టికాహారం అందించడం, బరువు తూచడం మొదలైన విషయాలన్నీ పైపైన చూస్తారు తప్ప, ఆ కార్యకారణ సంబంధాన్ని విడమరిచి తెలపరు. గర్భవతి తల్లుల మానసిక స్థితి కూడా శిశుజననాలపై ప్రభావం చూపుతుందనే విషయాన్నే గమనించరు.
యుక్త వయసు రాకుండానే పిల్లే తల్లి అవుతున్న సమాజంలో ఆ శిశువే కాదు, ఆ తల్లికి (అంటే ఆమె కూడా పిల్లే) కూడా సంరక్షణ వుండదని నిర్ద్వందంగా భావించాలి.
బాల్యదశ కూడా మనకు చాలా కీలకం. కుటుంబం నుంచి అప్పుడే చిన్నారి (బాలుడు/ బాలిక) బడి లేదా అంగన్‌వాడీ అనే తొలి సమాజపు గుడిలోకి ప్రవేశిస్తాడు. కుటుంబంలో దొరకని శారీరక ఆరోగ్యం (పౌష్టికాహారం), మానసిక ఆరోగ్యం (ఆటపాటల విద్యాబోధన) సామాజిక ఆరోగ్యం (కులమతాలకు అతీతంగా హాయిగా కలసిమెలసి జీవించడం) అక్కడ అలవడుతుంది.
ఈ నర్సరీ పాఠశాలలను, ప్రాథమిక విద్యాలయాలను అంత సున్నితంగా, పరిశుభ్రంగా పవిత్రంగా నిర్వహించాలి. తల్లిని మించిన సంరక్షణ బాలలు ఇక్కడ పొందగలగాలి. నర్సరీ, ప్రైమరీ, అంగన్‌వాడీ టీచర్‌ల బాధ్యత ఎంతో విలువైనది. పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులనూ గుర్తెరిగి, పిల్లల ఎదుగుదల తీరు, వికాసం, భాష, ఉచ్ఛారణ గురించి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చెబుతూ వుండాలి. ఇటు తల్లిదండ్రులు పట్టించుకోక, అటు టీచర్ పట్టించుకోకపోతే బాల్యం మొగ్గదశలోనే ఆగమైపోతుంది. వ్యవస్థ లోపాలతో పాటు టీచర్లకు, తల్లిదండ్రులకు ఆ సమన్వయం సోయి లేకపోవడం వలన కూడా మన బాల్యం గతి తప్పుతున్నది.
భిన్న కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన బాలలకు ప్రాథమిక బడి అక్కున చేర్చుకుని సాంత్వన ఇవ్వాలే తప్ప, అక్కడ కూడా భయపెట్టి, పట్టించుకోని నిర్లక్ష్యపు వాతావరణంలో వుంటే ఎట్లా? ఆ పిల్లలు అనుభవించే క్షోభ ఎవరికి చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారు? బడి వుంటుంది. టీచర్లు వుంటారు. తల్లిదండ్రులు వుంటారు. అన్నీ వుంటాయి. అందరూ వుంటారు కానీ పిల్లల్ని ఆదరించి అర్ధంచేసుకునేవారే కరువవుతారు. అలాంటి పరిస్థితుల్లో బాలల సంరక్షణ అనేది కరి మింగిన వెలగపండే.
ఇక హైస్కూల్ (ఉన్నత పాఠశాల) విద్యావిధానం సరేసరి. సగానికి పైగా పాఠశాలల్లో ఆటస్థలాలే లేవు. ఆటలు పాటలు లేకుండా పిల్లలు ఎలా ఎదుగుతారు? సంపూర్ణ ఆరోగ్య రక్షణ ఎలా లభిస్తుంది.
పరీక్షలు, పాఠాలు బట్టీయం, హోంవర్క్‌లు చేయించడం, ర్యాంకుల వేట – ఇదే చదువు. ఇదే బోధన అన్న రీతిలో విద్యావ్యవస్థ నడుస్తున్నది. బాలల సమగ్ర వికాసం, సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్) అనేది అర్ధం పర్దం లేని మాటలుగా తయారైనాయి.
ఈ వయసు (కిశోర వయస్సు) పిల్లల్లో చక్కటి స్నేహభావం పెంపొందేలా టీచర్ నడుం కట్టాలి. గెలిచినా, ఓడినా సమంగా తీసుకునే స్పోర్టివ్‌నెస్‌కు బీజం వేయాలి. తమని తాము తెలుసుకునే విధంగా వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేయాలి. తరగతి గదిలో పాఠ్యపుస్తకం పాఠానికే పరిమితం కాకుండా ప్రకృతిని, లోకాన్ని, సమాజాన్ని చదివేలా బాలలను సన్నద్దం చేయాలి. చాలామంది టీచర్లు ఇదంతా తమ వృత్తిలో భాగమేనన్న విషయమే మరచిపోయారు. యంత్రంలా పనిచేస్తూ బిల్ అండ్ బెల్ పద్ధతికి దిగజారిపోయారు.
ఉన్నత పాఠశాల ఆవరణలు, గదులు పరిశుభ్రంగా వుంచుకోవాలనే తలంపే వుండదు. టాయిలెట్స్ సక్రమంగా వుండవు. ఎదిగే వయసు పిల్లలకు పౌష్టికాహారం ఎంత ముఖ్యమో పరిశుభ్రత అంత ముఖ్యం. పైగా మున్నెన్నడూ లేని విధంగా గుట్కా, ఖైనీ, డ్రగ్స్ హైస్కూల్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌తో పాటు పబ్జీ గేమ్స్, పోర్న్ కల్చర్ విశృంఖలంగా రంగంలోకి వచ్చాయి.
వీటన్నిటి మధ్య బాల్యం నేడు సాలెగూడులో చిక్కుకున్నట్టు చిక్కుకుపోతున్నది. కనుకనే ఈ కిశోరబాలలు ఆత్మస్థైర్యం కోల్పోయి, కుంగుబాటుకు లోనౌతూ ఆత్మహత్యలకు చేరువవుతున్నారు.
పోర్న్ కల్చర్‌కు అలవాటుపడి పోస్కో చట్టాలకు చిక్కుకుంటున్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడి నిర్వీర్యమవుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు అలవాటుపడి తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తున్నారు. ఇవన్నీ టీచర్లకే గాక తల్లిదండ్రులకు, పెద్దలకు కూడా నూతన సవాళ్లు.
అందువల్ల బాలల సంరక్షణ కేవలం టీచర్లకు, తల్లిదండ్రులకు పరిమితమైన అంశమే కాదు. యావత్ సమాజానిది. వ్యవస్థది. దేశానిది. బాలల సంరక్షణను ప్రథమ కర్యవ్యంగా గుర్తించకపోతే మన భవిష్యత్ కాళ్లను మనమే చేజేతులా స్వయంగా నరుక్కోవడమే అవుతుంది. మన భారత సమాజం ఆటవిక సమాజంగా మారకముందే బాలల సంరక్షణకు తగు ప్రణాళికలు రచించి అమలుపరచాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇదో ఉద్యమంగా సాగితే తప్ప న్యాయం జరగదు.
(నవంబర్ 7 బాలల సంరక్షణా దినోత్సవం)
– శైలి
9959745723