– ”పాలమూరు- రంగారెడ్డి” పురోగతిపై నీలినీడలు
– తొమ్మిదేండ్లు కావస్తున్నా పూర్తికాని పనులు
– ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
– కాంగ్రెస్ ప్రభుత్వమైనా పూర్తి చేసేనా?
మూడేండ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మూడు ప్రభుత్వాలు ఏర్పాటైనా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. 2015 జూన్ 11న అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుకు భూత్పూరు మండలం కర్వేన దగ్గర భూమి పూజ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కరువు ఛాయలు దరిదాపుకే రావన్నారు. అయితే గత పాలకులు నిధుల కేటాయింపులో వివక్ష చూపడం వల్ల మూడేండ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు తొమ్మిదేండ్లయినా.. 60 శాతం పూర్తి కాలేదు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల్లో పురోగతి లేదని కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల సందర్శన చేసిన సందర్భంగా ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
90 టీఎంసీల సామర్థ్యం.. 12 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఆయకట్టు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. రోజుకు ఒకటిన్నర టీఎంసీల చొప్పున 8 రోజులు 90 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంది. సముద్ర మట్టానికి 269.735 మీటర్ల ఎత్తున ఉన్న లక్ష్మిదేవిపల్లి వరకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. అయితే మొదటి రిజర్వాయరైన అంజనగిరి, రెండో రిజర్వాయరు ఏదులను పూర్తి చేశారు. వీటి పరిధిలో స్ట్రక్షర్, బ్రిడ్జీల నిర్మాణం జరగాల్సి ఉంది. నార్లాపూర్‌లో 8.51 టీఎంసీల రిజర్వాయరు పూర్తి చేసినా.. ఇంకా ఈ ప్రాంత వాసులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందజేయలేదు. ఏదు ల సమీపంలో వీరాంజనేయ రిజ ర్వాయరును 8 టీఎంసీల సామ ర్థ్యంతో నిర్మించారు. వట్టెం రిజర్వాయరును 16.74 టీఎంసీల సామర్థ్యంతో నిర్మి ంచారు. ఇక్కడ 4,88,000 ఎకరాల ఆయకట్టు సాగవ్వా లి. కర్వేనా దగ్గర కురు మూర్తి రాయ రిజర్వాయర్‌ను 16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తు న్నారు. ఇక్కడ 1.90 లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ఉద్దండపూర్ రిజర్వాయరును 16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఆయకట్టు 4,88,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే, వీటి పనులు ముందుకు సాగడం లేదు.
నిలిచిన పనులు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు నిధులు లేక నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వ మైనా చర్యలు తీసుకుంటుందేమోనని ఆశతో రైతు లు ఎదురు చూస్తున్నారు. వట్టెం దగ్గర రిజర్వాయరు పనులు నిలిచిపోయాయి. కట్ట పనులు సైతం ఆగి పోయాయి. కాల్వ పనులు జరగాల్సి ఉంది. తిమ్మాజీపేట వట్టెం మధ్య ఉన్న ప్రధాన కాల్వ బ్రిడ్జీల నిర్మాణం జరగాల్సి ఉంది. ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులు పాక్షికంగా జరిగి నిలిచిపోయాయి. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులిస్తేనే పనులు పూర్తవుతాయి. బడ్జెట్‌లో కేటా యించిన నిధులను పూర్తిస్థాయిలో వినియో గిస్తే .. ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగే అవకాశాలున్నాయి.
ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలి
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో జాప్యం తగదు. నిధుల కేటాయింపులోనూ వివక్ష చూపుతున్నారు. ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. నీళ్లు లేక భూములు బీళ్లుగా మారుతున్నాయి. రిజర్వాయర్లను నింపి ఆయకట్టుకు సాగు నీరవ్వాలి.
– శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్