– మూతపడనున్న సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ
– గోడౌన్లలో లక్షలాది మీటర్ల వస్త్ర నిల్వలు
– ఈనెల 15 నుంచి బంద్‌కు యజమానుల నిర్ణయం
– అయోమయంలో ఆసాములు, కార్మికులు
– బంద్ పెట్టొద్దని వేడుకోలు
సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను ఈ నెల 15నుంచి నిరవధికంగా బంద్ చేసేందుకు పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. సిరిసిల్లలోని పాలిస్టర్ యజమానుల సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. యజమానుల నిర్ణయంతో ఆసాములు, కార్మికులు అయోమయానికి గురయ్యారు. ఇది సరైన విధానం కాదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వస్త్ర పరిశ్రమ బంద్‌ను ఆపాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతోపాటు కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.
నవతెలంగాణ – సిరిసిల్ల
లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్‌లలో పేరుకుపోయింది. కొత్తగా నూలు దారాన్ని కొని వస్రోత్పత్తి కొనసాగించే పరిస్థితిలో లేమని పాలిస్టర్ యజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకు బకాయిలు గత ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాదిమంది పవర్‌లూమ్, నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడనున్నారు.
కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం
బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి సిరిసిల్లలో పవర్‌లూమ్ పరిశ్రమ మందకోడిగా కొనసాగుతోంది. పరిశ్రమలో చేతినిండా పని లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పవర్‌లూమ్ కార్మికుల జీవితాలను తీవ్రంగా ప్రభావం చేయనుంది. రోజువారీ వేతనాలతో పనిచేసే నేత కార్మికులు ఉపాధి లేక వీధిన పడనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్రమకు అందించే ఆర్డర్లు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. 600లోపు మర మగ్గాలు నడిచే టెక్స్‌టైల్ పార్కుకు, 25వేలకు పైగా మరమగ్గాలు నడిచే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమానంగా ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడం పట్ల సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
ఎం.రమేష్, పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ అయితే వేల కుటుంబాలు, కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. పాలిస్టర్ బట్టకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని పవర్‌లూమ్ యజమానులు పరిశ్రమను బంద్ పెట్టడం సరికాదు. యజమానులు, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూడాలి. పరిశ్రమపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం కల్పించుకొని పవర్‌లూమ్స్ యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలి.
మరమగ్గాల బంద్ సరికాదు
30సంవత్సరాల నుంచి పవర్ లూమ్స్ నడుపుతున్నాను. ఎన్నడూ లేని విధంగా ఈనెల 15నుంచి నిరవధికంగా యజమానులు బంద్ పెట్టడం సరికాదు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మేము జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది. యజమానులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి.
-లక్ష్మణ్, మరమగ్గాల కార్మికుడు