– ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
– వికారాబాద్ జిల్లా పరిగిలో ఘటన
నవతెలంగాణ-పరిగి
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళా మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం గూడూరు గ్రామానికి చెందిన యాదమ్మ (33) గర్భసంచి ఆపరేషన్ కోసం సాధన ఆస్పత్రిలో చేరింది. రెండ్రోజుల క్రితం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. శుక్రవారం ఉదయం మహిళను వాకింగ్ చేయించే సమయంలో ఆమె జారిపడింది. దాంతో గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రి యాజమాన్యం ఆమెను తమ వాహనంలో హుటాహుటిన వికారాబాద్ ఈషా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
మహిళకు ఆపరేషన్ జరిగిన రెండో రోజే మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైటాయించారు. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
గొడవ పెద్దదవుతుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులకు నచ్చజెప్పి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.