పెండ్లి బృందం కారు ఢీ… మహిళ మృతి

పెండ్లి బృందం కారు ఢీ... మహిళ మృతి– బంధువుల ఆందోళన, రాస్తారోకో
– భారీగా మోహరించిన పోలీసులు
–  కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు
నవతెలంగాణ-చేగుంట
పెళ్లి బృందాన్ని కారుతో ఢీకొీట్టిన ఘటనలో జరిగిన దాడిలో మృతి చెందిన ఉప్పు రమ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. మెదక్‌ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం మృతురాలి బంధువులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కక్షలు మనసులో పెట్టుకొని, భూ తగాదాను సాకుగా చూపి పెండ్లి జరుగుతున్న సమయంలోనే గలాటా సృష్టించడానికి నిందితుడు నరేందర్‌ ప్రయత్నించాడని బంధువులు ఆరోపించారు. అప్పగింతల తర్వాత తన కారుతో పెండ్లి బృందాన్ని ఢకొీట్టాడని, ఈ ప్రమాదంలో రమ్య మృతిచెందడంతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారకుడైన నరేందర్‌ను తమకు అప్పజెప్పాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారిపై బాధిత కుటుంబసభ్యులు బైటాయించారు. పారిపోతున్న నరేందర్‌ను పోలీసులు పట్టుకోకుండా వదిలేశారని, ఆయన వాహనం స్టేషన్‌లో పెట్టి ఎలా పారిపోతాడని, ఇదంతా పోలీసుల ప్రమేయం లేకుండా జరిగిందా అంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 45 నిమిషాల పాటు వారు ఆందోళన నిర్వహించడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ లక్ష్మీ బాబు, పలు పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బందితో ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు. కాలనీవాసులు ఆగ్రహంతో ఉన్న కాలనీవాసులతో రామాయంపేట సీఐ మాట్లాడి, వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రామాయంపేట సీఐ హామీతో ధర్నా విరమించగా భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి పోలీసులకు చాలా సమయం పట్టింది. కాగా, పెళ్లి బందంపై కారుతో దాడికి దిగిన నిందితుడు ఉప్పు నరేందర్‌పై మర్డర్‌ కేసు నమోదు చేసినట్టు తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపారు. పరారైన నరేందర్‌ను వెతకడం కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామని, అతని సెల్‌ఫోన్‌ సిగల్‌ 300 కిలోమీటర్ల దూరంలో చూపిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని కోర్టుకు అప్పజెప్తామని డీఎస్పీ తెలిపారు.