నాటేస్తుండగా విద్యుద్ఘాతం.. మహిళ మృతి

నాటేస్తుండగా విద్యుద్ఘాతం.. మహిళ మృతినవతెలంగాణ – తంగళ్లపల్లి
పొలంలో నాటు వేస్తున్న మహిళ విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో మంగళ వారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడూరు గ్రామానికి చెందిన మల్లెబోని రాకేష్‌- మధుప్రియ (28) దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో రోజులాగే మంగళవారం కూడా కుటుంబ సభ్యులతో కలిసి మధుప్రియ వ్యవసాయ పొలానికి వెళ్లింది. అయితే, అప్పటికే పొలంలోని విద్యుత్‌ స్తంభం నుంచి వైరు తెగి పడింది. అది ఎవరూ గమనించలేదు. మధుప్రియ తోటి కోడలతో కలిసి పొలంలో నాటు వేస్తూ వెనుకకు నడుస్తున్న క్రమంలో విద్యుత్‌ వైరు కాలికి తగిలింది. దాన్ని చేతితో పక్కకు తీస్తుండగా షాక్‌కొట్టింది. కుటుంబ సభ్యులు వెంటనే మధుప్రియను 108ద్వారా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.