పిడుగు పాటుకు మహిళ మృతి

నవతెలంగాణ-ఆమనగల్‌
రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ పట్టణ సమీపంలో ఆదివారం పిడుగు పాటుకు గురై మహిళా రైతు మృతిచెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్‌ పట్టణానికి చెందిన కావటి లక్ష్మయ్య భార్య కావటి పద్మమ్మ (45) రోజు మాదిరిగా గొర్రెలు మేపడానికి పొలానికి వెళ్లింది. గుర్రంగుట్ట సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో గొర్రెలు మేపు తుండగా ఈదురుగాలులతో అకాల వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందికి వెళ్ళింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కింద ఉన్న పద్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త లక్ష్మయ్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన పద్మమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
వడదెబ్బతో ఒకరు మృతి
నవతెలంగాణ – జమ్మికుంట
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని కొత్తపల్లిలోని ఆదర్శ కాలనీ దగ్గర ఆదివారం ఉదయం ఎండ తీవ్రత ఒక వ్యక్తి మృతిచెందారు. ఇల్లందకుంట మండలం చిన్న కోమటిపల్లి గ్రామానికి చెందిన ముడేడ్ల రాజయ్య (50) మతిస్థిమితం కోల్పోయి ఊరూరా తిరుగుకుంటూ భిక్షాటన చేసుకుంటూ, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఏరుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం కొత్తపల్లిలో ఆదర్శ కాలనీలో రైల్వే ట్రాక్‌ పక్కన ఎండ తీవ్రతకు చనిపోయినట్టు పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు.