– గ్యారంటీల అమలు కు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం
– నేటి నుండి మహాలక్ష్మి పథకం అమలు
– ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం
– కండక్టర్లకు దిశా నిర్దేశం చేసిన ఆర్టీసీ అధికారులు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి సారించింది. తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలు దస్త్రం పైనే తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా అందులో మొదటిది మహాలక్ష్మి పథకం. మహిళలకు ప్రాధాన్యనిస్తు ఆ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. నేడు (శనివారం) కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా లకు బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకాన్ని నేడు మధ్యాహ్నం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా నల్లగొండ జిల్లా కేంద్రంలో డిఆర్డిఓ పిడి. కాలిందిని ఆర్టీసీ ఆర్ఎం. శ్రీదేవితో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పథకం అమలు పై ఆర్టిసి ఎండి. సజ్జనార్ జిల్లా ఆర్టిసి అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి ఆదేశాలు జారీ చేయగా ఆర్టిసి జిల్లా అధికారులు పథకం అమలు తీరుపై కండక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు…
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకం ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో అమలులో ఉన్న అది రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల మహిళలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది.ఇకనుండి మహిళల రవాణా సౌకర్య చార్జీలను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది.అయితే ఉచిత ప్రయాణానికి మహిళలు ఏదేని గుర్తింపు కార్డును బస్సు కండక్టర్ కు చూపించాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో డిపోలు.. బస్సులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 7 డిపోలు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కెట్పల్లి, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట డిపోలు ఉన్నాయి.ఈ డిపోల పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు మొత్తం 647 ఉండగా అందులో 257 అద్దె బస్సులు ఉన్నాయి. వీటన్నింటిలలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్ లు రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు…
– ఏదైనా ఐడి కార్డు చూపించి మహిళలు ప్రయాణించవచ్చు.
– లిమిట్స్ ఏమి ఉండవు..ఎక్కడనుండైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు.
– జీరో టిక్కెట్ నీ ఇష్యూ చేస్తారు.
– ప్రయాణికులతో వినయంగా మర్యాద పూర్వకంగా మెలగాలి.
– ఎలాంటి అసౌకర్యానికి గురి చేయవద్దు.
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 647 బస్సులను ఈ పథకానికి ఉపయోగిస్తున్నారు.
– ప్రభుత్వం కూడా ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇస్తామని చెప్పింది.
– త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాబోతున్నాయి.
– ఏ రోజైనా ఈ పథకం పని చేస్తుంది.
– తీర్థయాత్రలకు ఒకే సారి వేళ్ళే వాళ్ళకి ఈ స్కీం వర్తించదు.
– అవసరం ఉన్నచోట పురుషులకు కూడా స్పెషల్ గా బస్సులు నడిపిస్తాం.
– ఈ స్కీం లో ఆర్డినరీ, ఏసీ బస్సులు కూడా నడిపిస్తాం.
– మహిళల బస్సు పాసులు నేటి నుండి పనిచేయవు.
– రియాంబర్స్మెంట్ చేసేది లేదు.
మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది….
ఎస్. శ్రీదేవి ( రీజనల్ మేనేజర్ ఆర్టిసి నల్గొండ)
ప్రభుత్వం గొప్ప పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకంతో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సౌఖ్యం, సురక్షితం. మహిళలు ఈ గొప్ప పథకాన్ని ఉపయోగించుకోవాలి. వారితోపాటు వారి కుటుంబ సభ్యులను సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణింపచేయాలి. ప్రైవేటు ట్రావెల్స్ లలో ప్రయాణం చేయడం ప్రమాదకరం. ఎన్నికల సమయంలో ప్రయాణికుల నుండి ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ వారు కోదాడ వరకు 1500 రూపాయల వరకు చార్జ్ వసూలు చేశారని తెలిసింది. ప్రతిరోజు 1.70 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. అందులో 40 శాతం మంది మహిళలే ఉంటారు. ఇకనుండి వారందరికి ఉచిత ప్రయాణమే.