మానవ సమాజానికి మూలం ‘మహిళా’

– మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
–  మహిళ అబల కాదు, సబల
–  ఐసీడీఎస్ సూపర్వైజర్ కవితా రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
మానవ సమాజానికి మూలం మహిళ అని, మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ అంటే అబల కాదు, సబల అని ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘నవ తెలంగాణ’తో మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరుగుతుంది. మహిళలు లేనిది సమాజం లేదు. అయితే మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కావున మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న నిర్భయ, దిశ, ఫోక్సో, షీ టీమ్స్ లాంటి చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. గాంధీజీ చెప్పిన విధంగా అర్థరాత్రి ఒంటరి మహిళ స్వేచ్ఛగా బయటకి వచ్చి తిరిగినప్పుడే మహిళాభివృద్ధి సాధించినట్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాలను కఠినంగా అమలు చేయాలి. మహిళలకు కుటుంబం పట్ల పురుషుల కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. తల్లిగా, భార్యగా, అధికారిగా, రాజకీయ నాయకురాలిగా ఎంతో బాధ్యతగా పనిచేయడం జరుగుతుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. 2024లోకి అడుగుపెట్టాం. అంతర్జాతీయ దినోత్సవం ప్రారంభమై 112 ఏళ్లు గడిచినా మహిళా సాధికారత కాగితాలకే పరిమితం అయింది. మహిళలు కోరుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలు అన్నింట అసమానత కొనసాగుతూనే ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో 545 మంది సభ్యులు ఉన్న పార్లమెంటులో కేవలం 12 శాతం మహిళల స్థానం. మరో ప్రధాన సమస్య ఆహార భద్రత 76% మందికి సరిపడా క్యాలరీలు ఉన్న ఆహారం దొరకడం లేదు. 50% స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇన్ని సమస్యలు దాటి మహిళలు అభివృద్ధి చెందాలంటే ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. మహిళలు చైతన్యవంతులు అయినప్పుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.