మహిళల ప్రాతినిథ్యం తక్కువే !

మహిళల ప్రాతినిథ్యం తక్కువే !– ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేని రాష్ట్రం ఇదే
– ప్రతిబంధకంగా ఉన్న వ్యక్తిగత జీవితాలు ప్రోత్సాహమూ లేదు
– మిజోరం ఎన్నికల చిత్రం
ఐజ్వాల్‌ : మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో గత నెలలో జరిగిన నిరసన ప్రదర్శనకు వేలాది మంది హాజరయ్యారు. లంగ్‌లై సౌత్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి అర్హతపై ప్రశ్నించేందుకు వారంతా అక్కడికి చేరుకున్నారు. చట్ట ప్రకారం కాంగ్రెస్‌ అభ్యర్థి మెరియమ్‌ హంగ్‌చల్‌కు పోటీ చేసే అర్హత ఉంది. కానీ కొందరు ఓటర్ల దృష్టిలో మాత్రం ఆమె పోటీకి అనర్హురాలు. గోర్ఖా తరగతికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమె గిరిజన హోదాను కోల్పోయారని, అలాంట ప్పుడు ఎస్టీలకు రిజర్వ్‌ చేసిన స్థానంలో ఆమె ఎలా పోటీ చేస్తారని మిజో జిర్లారు పాల్‌ (ఎంజడ్‌పీ) అనే విద్యార్థి సంఘం ప్రశ్ని స్తోంది. అలాంటి అభ్యర్థులను పోటీకి దింపవద్దని ఆ సంఘం రాజకీయ పార్టీలను కోరింది. ఎంజడ్‌పీ మూడు లేఖలు రాసినప్పటికీ కాంగ్రెస్‌ మాత్రం మెరియమ్‌నే పోటీకి దింపింది. దీంతో మెరియమ్‌ని, ఆమె పార్టీని బహిష్కరించాలని ఎంజడ్‌పీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో మిజో జనాభా తక్కువగా ఉన్నదని, తమ సమాజాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎంజడ్‌పీ ప్రధాన కార్యదర్శి తోమ్టే చెప్పారు.
మిజోరంలో ఎంజడ్‌పీ వంటి పౌర సమాజ గ్రూపుల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. బీజేపీ ఇప్పటికే తుల్వాల్‌ స్థానంలో తన అభ్యర్థిని మార్చేసింది. కాంగ్రెస్‌ మాత్రం లంగ్‌లై సౌత్‌లో మెరియమ్‌నే కొనసాగిస్తుండడంతో వివాదం చెలరేగుతోంది. మిజోరంలో మహిళలు రాజకీయాల్లో ఎక్కువగా ప్రవేశించకపోవడానికి వారి వ్యక్తిగత జీవితాలను ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే ఇతర రంగాల్లో మాత్రం వారి భాగస్వామ్యం అధికంగానే ఉంటోంది.
అందరికీ భిన్నంగా…
అయితే మహిళలందరి పరిస్థితి ఒకేలా లేదు. జేపీఎం తరఫున పోటీ చేస్తున్న మాజీ టీవీ ప్రజెంటర్‌, రేడియో జాకీ వన్నైసాంగీకి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రచారం సందర్భంగా కొందరు ఆమెతో సెల్ఫీలు దిగుతున్నారు. మరికొందరు ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్నారు. అవివాహిత మహిళగా ఎన్నికల్లో పోటీ చేయడం సవాలుతో కూడుకున్నదేనని ఆమె చెప్పారు. ఇది 21వ శతాబ్దమని, కొత్త చరిత్ర సృష్టించడానికి సమయం ఆసన్నమైందని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మహిళలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, ఉపాధి వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కన్పిస్తోంది.
త్రిముఖ పోటీ
ముఖ్యమంత్రి జోరాంతంగా నేతృత్వంలోని ఎంఎన్‌ఎఫ్‌ పార్టీ ప్రతిపక్షాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. 2013 ఎన్నికల్లో 34 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఐదు స్థానాలకు పరిమితమైంది. మరోవైపు గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జేపీఎం) 22% ఓట్లు సంపాదించి సవాలు విసురుతోంది. స్థానిక ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకూ మిజోరంను ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ పార్టీలే పరిపాలించగా ఇప్పుడు జేపీఎం కూడా రంగంలో ఉండడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
ప్రాతినిథ్యం తక్కువే
1987లో మిజోరంకు రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుంచి కేవలం నలుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే శాసనసభలో ప్రవేశించారు. మిజోరం అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం దేశంలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేని రాష్ట్రం ఇదే. అక్షరాస్యతలో దేశంలోనే మిజోరం మూడో స్థానంలో ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 976 మంది మహిళలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో సగానికి పైగా అంటే 4,38,925 మంది మహిళా ఓటర్లే. అయినప్పటికీ చట్టసభలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. మిజోరం శాసనసభ ఎన్నికల్లో 174 మంది పోటీ చేస్తుండగా వారిలో 16 మంది మహిళలు. బీజేపీ నుంచి ముగ్గురు, ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌, జడ్‌పీఎం నుంచి ఇద్దరు చొప్పున పోటీలో ఉన్నారు. మిగిలిన వారు స్వతంత్రులు. 2018 ఎన్నికల్లో 18 మంది మహిళలు పోటీ చేసినప్పటికీ ఒక్కరూ గెలవలేదు. 2013లో ఎనిమిది మంది పోటీ చేశారు.
ప్రోత్సాహం లేదు
బీజేపీ టిక్కెట్‌ నిరాకరించిన జోహ్ మింగ్‌లియానీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీలోనూ, రాజకీయాల్లోనూ తన భవితవ్యంపై ఆమె ఎటూ చెప్పలేకపోతున్నారు. మహిళల కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో పలు హామీలు ఇచ్చాయి. ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం అతి తక్కువగా ఉండడంపై స్వతంత్ర అభ్యర్థి హ్లాండో మాట్లాడుతూ ‘రాజకీయాల్లోకి రాకుండా మహిళల్ని ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. చర్చిల్లో సైతం మహిళా పెద్దలు కానీ, పాస్టర్లు కానీ లేరు’ అని వాపోయారు. మహిళలు పని చేయాలని సమాజం కోరుకుంటోంది కానీ వారు నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండడం దానికి ఇష్టం లేదని పీహెచ్‌డీ విద్యార్థిని నామ్టే తెలిపారు.