మహిళలు కనెక్ట్‌ అవుతారు

మహిళలు కనెక్ట్‌ అవుతారుసత్యం రాజేష్‌ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ‘టెనెంట్‌’. వై.యుగంధర్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మోగుళ్ళ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్‌ రెడ్డి.ఎన్‌ సహ నిర్మాత. ఈనెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో ప్రియదర్శి మాట్లాడుతూ,’నటుడిగా రాజేష్‌ ప్రయాణం, ట్రాన్స్‌ఫర్మేషన్‌ స్ఫూర్తిదాయకం. ముందు రిలీజ్‌ చేసిన ట్రైలర్‌తో పాటు ఇప్పుడు రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ బాగా నచ్చింది. నిర్మాతల కళ్ళలో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో తెలుస్తోంది. కంటెంట్‌ చాలా కొత్తగా ఉంది’ అని తెలిపారు. ‘దర్శకుడు యుగంధర్‌ ఈ కథని ఎంత అద్భుతంగా చెప్పారో అంతే అద్భుతంగా సినిమాని తీశారు. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చేశాయి. నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి ఈ సినిమాని చాలా ప్రేమించి చేశారు’ అని హీరో సత్యం రాజేష్‌ చెప్పారు. దర్శకుడు వై.యుగంధర్‌ మాట్లాడుతూ, ‘ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్‌ అయ్యే కథ ఇది. మహిళలు చూస్తే తప్పకుండా చూడాలని అబ్బాయిలకి చెబుతారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా’ అని తెలిపారు. ”టెనెంట్‌’.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా. ఇందులో ఎమోషన్‌ అద్భుతంగా ఉంటుంది’ అని నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు.