వైజ్ఞానిక రంగంలో వనితలు

In the field of science womenజీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని నిరూపించారు, నిరూపిస్తూనే ఉన్నారు. కనుక వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్ష లేని సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఈ రోజు ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’ (నేషనల్‌ సైన్స్‌ డే) సందర్భంగా సైన్సులో మహిళల ప్రాతినిధ్యాన్ని, శాస్త్ర విజ్ఞాన ప్రగతిలో వారి భాగస్వామ్యం గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
భారతదేశానికి సైన్సులో తొలి నోబెల్‌ బహుమతి తెచ్చిన గొప్ప శాస్త్రవేత్త సి.వి.రామన్‌. ఆయన తన పరిశోధనా ఫలితాలను వెల్లడించిన ఫిబ్రవరి 28వ తేదీని ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’గా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. అయితే సైన్సు, టెక్నాలజీ వంటి రంగాల్లో వివక్షకు తావుండదని అనుకునే వారు మనలో చాలా మంది ఉంటారు. పురుషులతో పోల్చిచూస్తే విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్త్రీల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తక్కువగా ఉన్నదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ అసమానతలు మరీ ఎక్కువ. కాలేజీల్లో అమ్మాయిల ప్రవేశాలు ముఖ్యంగా సైన్సు టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, వైద్య కోర్సుల్లో తగినంత ఉండటం లేదు. ఒకవేళ సైన్సులో పట్టభద్రులయినా, డాక్టరేట్లు చేసినా సైన్సును వృత్తిగా కొనసాగించటం చాలా కష్టంగా ఉంది. సెకండరీ విద్యలో కొంత వరకు జెండర్‌ వివక్ష సమసిపోయిందని మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ 2016లో వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. పోస్టు గ్రాడ్యుయేట్‌ వరకు మహిళల శాతం కొంత మెరుగ్గా ఉన్నా ఆపై పరిశోధనా పరమైన చదువుల్లో (ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి) మహిళల నిష్పత్తి పడిపోతున్నది. ఉద్యోగాల్లో తగిన ప్రోత్సాహం లేకపోవడమే కొంతమేరకు కారణం.
ఇండియాలో మరీ ఎక్కువ
వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు 30శాతం కంటే తక్కువగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. మహిళల పట్ల ఈ వివక్ష ప్రపంచమంతటా ఉన్నా ఇండియా వంటి వర్ధమాన దేశాల్లో మరీ ఎక్కువ. మన దేశంలోని శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, ఇంజనీర్లలో మహిళలు కేవలం 14శాతమే. నిజానికి అమెరికాలో సైతం పరిస్ధితి ఇంతకంటే మెరుగ్గా ఏమిలేదు. అక్కడి ఇంజనీర్లలో మహిళలు కేవలం 11శాతం మాత్రమే. ఉద్యోగాల్లో కూడా 12శాతం మహిళలే ఉన్నారు. జీవశాస్త్రంలో ఐదు శాతం, ఇంజనీరింగ్‌లో 8శాతం, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ చదువుల్లో కేవలం 3శాతం మంది మాత్రమే మహిళలున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ సిబ్బందిలో కూడ మహిళలు 8శాతానికి మించి లేరు. ఇక అటువంటి సంస్థలకు నేతృత్వం వహించే డైరెక్టర్లుగా మహిళలను అస్సలు ఊహించలేం. పురస్కారాలు, ప్రోత్సాహకాల విషయంలో కూడా మహిళల పట్ల చిన్నచూపే వుంది. మన దేశంలో పద్మశ్రీ అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాళ్‌. ఆమెకు ఆ పురస్కారాన్ని 1977లో ఇచ్చారు.
సైన్స్‌లో తమదైన ముద్ర
ఏది ఏమైనా దశాబ్దాల కిందటే సామాజిక కట్టుబాట్లను, కష్టాలను ఎదుర్కొని సైన్స్‌లో తమదైన ముద్రవేసిన మహిళా స్ఫూర్తి ప్రదాతలుగా ఎందరో ఉన్నారు. తొమ్మిదేండ్లకే పెండ్లి చేస్తే, 14 ఏండ్లకే తల్లై, కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దు:ఖాన్ని దిగమింగి డాక్టర్‌ కావాలని సంకల్పించిన గొప్ప శాస్తవేత్త ఆనందీబాయి జోషి. అమెరికాలోని పెన్సిల్వేనియా మెడికల్‌ కాలేజీలో 1886లోనే పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళ ఈమె. ఇర సైన్స్‌ చదవాలని, పరిశోధనలు చేయాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ప్రవేశానికి కమలా సోహ్ని ఆరాట పడితే కేవలం మహిళ అనే కారణంగా ఆమెకు ప్రవేశం నిరాకరించారు. సి.వి.రామన్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె డాక్టరేట్‌ పూర్తి చేశారు. దేశంలో మొట్టమొదట పిహెచ్‌.డి పొందిన మహిళా శాస్త్రవేత్త కమలా సోహ్ని. సత్యేంద్రనాథ్‌ బోస్‌, రసాయన శాస్త్రంలో పిహెచ్‌.డి చేసిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందిన ఆసిమా ఛటర్జీ మొక్కల్లో ఉండే ఔషధాలను కనుగొన్నారు. కర్ణాటకలో తొలి మహిళా ఇంజనీరుగా పనిచేసిన రాజేశ్వరి ఛటర్జీ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో మిచిగాన్‌ యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ పొందారు. భారత వైజ్ఞానిక సంస్ధలో తన భర్తతో కలిసి ఎలక్ట్రిక్‌ కమ్యూనికేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్‌లో విశేష కృషి చేసిన విజ్ఞానవేత్తగా ఆమె ఖ్యాతి పొందారు.
వైజ్ఞానిక పరిశోధనా రంగంలో…
భారతదేశంలో గణిత పరిశోధకుల్లో మేటిగా పేరుగాంచిన మంగళ నార్లీకర్‌ గణితాన్ని సులభతరం జేసి మనసుకు హత్తుకునేలా బోధించేవారు. పెండ్లయిన పదహారేండ్లకు ఆమె గణితశాస్త్రంలో పిహెచ్‌.డి చేశారు. వీరేగాక ఇటీవలి కాలంలో ఎందరో మహిళలు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ఇస్రో రాకెట్‌ శాస్త్రవేత్త నందిని హరినాథ్‌ తన ఇరవై ఏండ్ల సర్వీసులో 14మిషన్స్‌లో పనిజేశారు. మంగళ్‌యాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. రక్షణ రంగ పరిశోధనల్లో పరిశోధనలు చేసి ‘అగ్ని’ క్షిపణి ప్రాజెక్టులకు నేతృత్వం వహించిన మహిళ టెస్సీ థామస్‌. క్షిపణి ప్రయోగాలను విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన ఈమెను ‘క్షిపణి మహిళ’, ‘అగ్నిపుత్రి’గా పిలుస్తారు.
సమాన ప్రాతినిధ్యం లేకుండా
స్త్రీలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత వుందో అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి మహిళల అవసరం ఉంది. ప్రపంచంలో సగభాగంగా ఉన్న మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా సైన్సేకాదు ఏ రంగమూ పురోగమించలేదు. స్త్రీ పురుష సమానత్వం ఒక మానవ హక్కు. దీన్ని నిజం చేయటానికి సైన్స్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించవలసి ఉంది. బాలికలను సైన్స్‌ పట్ల ఆకర్షించడానికి ఇప్పటికే డాక్టరేట్లు పొందిన మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సృజనాత్మక పరిశోధనలను దేశ ప్రగతికి వినియోగించుకోవటం ఎంతైనా అవసరం. వైజ్ఞానిక పరిశోధనల్లో వివక్ష రహితమైన సంపూర్ణ మహిళా భాగస్వామ్యమే నూతన ప్రపంచ నిర్మాణానికి చేయూతనిస్తుంది.
అవగాహన కలిగిస్తూ…
మహికో విత్తన సంస్థలో పరిశోధనలు చేసిన ఉషా బార్వాలే తొలి జన్యుమార్పిడి ఆహారపంట వంగడాన్ని ఉత్పత్తి చేస్తే.. జన్యుమార్పిడి పంటలతో ప్రజారోగ్యానికి వచ్చే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సంచలనం సృష్టించారు సుమన్‌ సహారు. ఈమే ‘జీన్‌ క్యాంపేయిన్‌’ను స్థాపించి స్థానిక ప్రజల, రైతుల హక్కుల కొరకు, కార్పొరేట్ల నుండి వారికి రావలిసిన వాటా రాబట్టేందుకు విశేష కృషి చేశారు. అంటార్కిటికాను సందర్శించిన తొలి మహిళా శాస్త్రవేత్త అదితి పంత్‌. కృత్రిమ గర్భధారణ పిండాల ప్రక్రియలను సుసాధ్యం చేసిన వారు ఇందిర హిందూజా. అంతరిక్షనౌక కొలంబియా ప్రయోగ ప్రమాదంలో చనిపోయిన మిషన్‌ స్పెషలిస్టు కల్పనా చావ్లా… ఇలా ఎందరెందరో మహిళా శాస్త్రవేత్తలు వైజ్ఞానిక పరిశోధనలను సమున్నతం చేసి ప్రఖ్యాతిగాంచారు.