గాజుల దుకాణాల్లో క్యూ కట్టిన మహిళలు

– గాజుల దుకాణాల్లో క్యూ కట్టిన ఒక్క కుమారుడి తల్లులు
– ఇద్దరు కుమారుల తల్లులు ఒక్క కుమారుని తల్లికి డబ్బులు అందజేత
–  ఐదిండ్ల డబ్బులతో ఐదు రకాల గాజులు పెట్టుకొనే ఆచారం
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మారుమూల సరిహద్దులో గల మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లోని మద్నూర్ మండలంలో మహిళల్లో కొత్త ఆచారం జోరుగా కనిపిస్తుంది. ఒక్క కుమారుడు తల్లులు ఇద్దరు కుమారులు ఉన్న తల్లుల ఐదుగురి వద్ద డబ్బులు తీసుకుని ఐదు రకాల గాజులు పెట్టుకోవడం ఆచారంగా మహిళలు భావిస్తూ,  గాజుల దుకాణాలు, గాజులు పెట్టుకోవడానికి క్యూ కడుతున్నారు. ఎవరో ఒకరు ఇలా చేయాలంటూ ఆచారం పెట్టి ఇంటింటికీ  ప్రచారమయ్యే విధంగా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకు తల్లులు ఐదుగురిండ్లలోకి వెళ్లి గాజుల కోసం డబ్బులు అడుగుతున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు ఒక్క కొడుకు తల్లి వచ్చి డబ్బులు అడిగితే కాదు అనలేక తోచిన విధంగా డబ్బులు అందజేయవలసిందే. ఇలాంటి ఆచారం మద్నూర్ మండలంలో జోరుగా కొనసాగుతోంది.  ఐదుగురి వద్ద తీసుకున్న డబ్బులతో ఐదు రకాల గాజులు పెట్టుకోవడానికి మండల కేంద్రంలోని గాజుల దుకాణాల వద్ద ఒక్క కుమారుడు ఉన్న తల్లులు క్యూ కడుతున్న దృశ్యాలు నవ తెలంగాణ చిత్రీకరించింది. మూడు రాష్ట్రాలకు సరిహద్దులో గల మద్నూర్ మండలంలో మహిళల్లో ఒకటి రెండు సంవత్సరాలకు ఏదో ఒక రకంగా ఆచారాన్ని ముందుకు తీసుకురావడం, ఆచారం పాటించకపోతే ఏమి జరుగుతుందోనని ఆందోళన మహిళలంతా ఒకరిని చూసి మరొకరు ఆచారం పాటించడం గమనార్హం.  ఇలాంటి ఆచారాలతో బంధువులు స్నేహితులు ఒకరినొకరు కలుసుకోవడం మహిళల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.