మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి..

– మహిళా శక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. .
– జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మహిళలను ఆర్థికంగా మరింత  బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చెపట్టిన మహిళ శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ప్రెసిడెంట్, సెక్రటరీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలను ప్రత్యేక లక్ష్యంతో వచ్చే ఐదేళ్లలో బలోపేతం చేయడమే లక్ష్యంగా మహిళా శక్తి ద్వారా 14 రకాల  కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు. అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు, పాఠశాలలు తెరిచే సమయానికి ఏకరూప దుస్తులు అందించి జిల్లాకు మంచి పేరు తెచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు .సెర్ఫ్ లో ఉన్న సామర్థ్యం ఎవరికీ లేదని ,వారి సామర్థ్యాన్ని వారి లక్ష్యంపై పెట్టాలని కలెక్టర్ సూచించారు.  మహిళ శక్తి క్రింద మైక్రో ఎంటర్ప్రైజెస్, కుట్టు కేంద్రాలు, పాడి పశువులు, బ్యాక్ యాడ్ పౌల్ట్రీ, సంచార మత్స్య విక్రయ అవుట్లెట్లు, మిల్క్ ప్యాలెస్, మీసేవ, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు ,ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కస్టం హైరింగ్ కేంద్రాలు వంటి 14 రకాల కార్యకర్తలు చేపట్టుటకు  మండలాల వారిగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఇట్టి కార్యచరణ ప్రకారం వివిధ మండలాల్లోని 579 గ్రామ సమాఖ్యలోని 17,647 మంది స్వయం సహాయక సంఘాల ద్వారా 86 కోట్ల పెట్టుబడులతో 8623 యూనిట్లు నెలకోల్పడమె  లక్ష్యంగా ఇప్పటి నుండె శ్రమించాలని , ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలోని విషయాలను, మండలాల వారిగా ,క్లస్టర్ వారిగా సమావేశాలు నిర్వహించి, యూనిట్స్ గురించి తెలపాలని లబ్ధిదారుల ఎంపిక చాలా ముఖ్యమైనదని జాగ్రత్తగా  ఎంపిక చేయాలని, ట్రైనింగ్ ఇప్పించి సకాలంలో  గ్రౌండింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. యూనిట్ గ్రౌండింగ్ సత్వర చర్యలు తీసుకొని బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ యూనిట్లు గ్రౌండ్ చేయాలని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి టి రూపేందర్ సింగ్, మహిళా సమైక్య అధ్యక్షురాలు పి సరస్వతి ,సెర్ఫ్ సిబ్బంది పాల్గొన్నారు.