మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి– పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పంచాయత్‌ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కోఠి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్‌ బిజినెస్‌ అవార్డులను అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యూడల్‌ భావజాలం కల్గిన పురుషాధిక్య సమాజంలో ఎదురవుతున్న అవమానాలను తట్టుకుని ఎదగాలని సూచించారు. అంది వచ్చిన అవకాశాలతో, ఆకాశమే హద్దుగా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కష్టపడాలని అన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఫిక్కీ మహిళా విభాగం సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తోందని కొనియాడారు. భవిష్యత్‌లో మరింతగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సోషల్‌ ఎంటర్‌ ప్రైజ్‌, దాతత్వం, సుస్థిరత, విద్య, తయారీ, ఆరోగ్య సంరక్షణ తదితర 10 విభాగాల్లో సేవలు అందించిన 25 మంది మహిళలకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి లేడిస్‌ ఆర్గనైజేషన్‌ మాజీ జాతీయ చైర్‌ పర్సన్‌ పింకి రెడ్డి, తెలంగాణ చాఫ్టర్‌ చైర్‌పర్సన్‌ రీతూషా తదితరులు పాల్గొన్నారు.