మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

– శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ రమ
– సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నవతెలంగాణ-మియాపూర్‌
మహిళలు అన్నిరంగాల్లోనూ రాణించాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ రమ అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి(హైదరాబాద్‌) ఆధ్వర్యంలో ముగ్గులు, మ్యూజికల్‌ చైర్‌ ఆటల పోటీలు నిర్వహించారు. పి.మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమ మాట్లాడారు. మహిళలు ప్రతి రంగంలోనూ రాణించాలని సూచించారు. మహిళ అంటే ఆదిశక్తి అని, వంటింటి కుందేలుగా ఉండొద్దని అన్నారు. పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంస్కృతి గొప్పతనమన్నారు. సాంఘిక కార్యకర్త ఎ.రాణి మాట్లాడుతూ.. ఎస్‌వీకే ఇలాంటి కార్యక్రమం నిర్వహిచడం.. మహిళలను ప్రోత్సహిచడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ఎం.సుజాత, 80 మంది మహిళలు పాల్గొన్నారు.