‘బేటీ బచావో’ అనే నినాదాన్ని అపహాస్యం చేసేలా దేశంలో మహిళలు, బాలికల మీద లైంగికదాడులు, హత్యలు వేగంగా పెరిగి పోతున్నాయి. చాలా సందర్భాల్లో బాధితులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారినే వేధించడం, బలాత్కరించటం, హత్య చేయడం కూడా జరుగుతున్నది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధికం
భారత దేశంలో ఇప్పుడు రోజుకు 86 లైంగికాడులు, గంటకు 49కి పైగా నేరాలు జరుగుతున్నాయి. ఇవి ప్రధానంగా బీజేపీ పాలనలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. టి.ఎం.సి పాలనలోని బెంగాల్‌లో కూడా మహిళల పైన, పిల్లలపైన భయంకరమైన లైంగికదాడులు సంభవించాయి. కర్నాటకలో బీజేపీ కూటమికి చెందిన బలమైన ఒక రాజకీయ పార్టీ ఎంపీ (తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాడు) వందలాది మంది మహిళల పైన లైంగికదాడులు చేయడమే కాక వాటిని చిత్రీకరించి వేధిస్తున్నట్లు బయటపడింది. బలైన వారిలో అనేకమంది ఆయన పార్టీకి చెందినవారే.
బెంగాల్‌లో వెల్లువెత్తిన నిరసనలు
ఇలాంటి ఘటనలపైన అక్కడక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి కానీ వాటి ప్రభావం పెద్దగా వుండటం లేదు. పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్‌పై అమానుష లైంగికదాడి, హత్యకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన నిరసన ఉద్యమం ఒక్కటే ఇందుకు మినహాయింపుగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు ప్రారంభించిన నిరసనకు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో వేలాది మంది స్త్రీ,పురుషుల మద్దతు లభించింది. దారు ణాన్ని అడ్డుకోవడంలోనూ విఫలమవటమే కాక తర్వాత నేరస్తులను కాపాడడానికి కూడా సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వ పాత్రను ఈ నిరసన ఉద్యమం ఎండగట్టింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజ్వరిల్లిన ఈ మహా నిరసన నుంచి మన కామ్రేడ్లు నేర్చుకోదగిన అనేక పాఠాలు ఉన్నాయి. అన్ని చోట్లా కూడా కొన్ని ఉమ్మడి అంశాలు కనిపిస్తాయి. అత్యధిక చోట్ల ఇలాంటి ఘటనలలో పోలీసులు చేయవలసింది చేయకపోగా బాధితు రాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదులను పూర్తిగా పెడచెవిన పెడుతున్నారు. దాంతో దుండగులు మరింత చెలరేగిపోయి వేధింపులకు దిగడం, లైంగికదాడులకు తెగబడడం కూడా జరుగుతున్నది.
నేరస్తులకు పోలీసులు, ప్రభుత్వ అండ
ఇలాంటి సందర్భాల్లో మరో ఉమ్మడి లక్షణం ఏమంటే నేరస్తులు పాలక పార్టీకి చెందిన వారైతే రక్షణ కల్పించడం, చర్య తీసుకోకుండా వదిలివేయటం జరుగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది సర్వసాధారణ వ్యవహారంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడిన బీజేపీ మీడియా సెల్ ప్రతినిధులు ముగ్గురుని విద్యార్థుల ఆందోళన తర్వాతే అరెస్ట్ చేశారు. అయితే వారిని కొద్ది మాసాల తర్వాత మళ్లీ వదిలిపెట్టారు. మరోవైపున నిరసన తెలిపిన ఆ విద్యార్థులను మటుకు బహిష్కరించి చదువుకునే అవకాశం లేకుండా చేశారు. బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి కేసులో..కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం సిగ్గు మాలిన పాత్ర వల..నిందితులకు పదేపదే బెయిల్ ఇప్పించడమే కాక శిక్ష నుండి మినహాయింపు కల్పించి విడుదల చేయటం చూశాం. అనేకమంది అమ్మాయిలపై లైంగికదాడులకు, హత్యలకు పాల్పడిన బాబా రామ్ రహీంను హర్యానా ప్రభుత్వం పదేపదే బెయిల్‌పై విడుదల చేస్తూ హిందీ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటున్నది.
మీడియాలో అనుచిత ధోరణి
చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలను బయటకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించే మీడియా కూడా తప్పు చేస్తుంటుంది. వీటిని నివేదించే సందర్భంలో లైంగిక దురహంకారం, పురుషాధిక్య ధోరణులు, అవమానకర భాషతో ఈ నేరం జరగడానికి బాధితులే కారణ మనీ అర్థం వచ్చేలా చేస్తుంది. సమాజంలో వ్యక్తులు బాధ్యతాయుత స్థానంలోని ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారుల ప్రకటనలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఈ పని జరుగుతుంది.
దేశవ్యాపిత ఉద్యమం
మహిళలు, పిల్లలపై పెరుగుతున్న ఈ హింసకు గల కారణాలను అరికట్టడం కోసం.. ఈ అంశంపై ఉద్యమం సాగించాలని.. సెప్టెంబర్‌లో జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం దేశ వ్యాపితంగా పార్టీ శాఖలన్నిటికీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జరిగిన అమానుషాలపై కేంద్రీకరించడంతో పాటు బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన, తప్పులకు, పొరబాట్లకు కారణమైన పోలీస్ అధికారులు, ప్రభుత్వ బాధ్యులను శిక్షించడం వంటి డిమాండ్లను కూడా జతచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో కుమ్మక్కై ఉంటే దాన్ని కూడా పూర్తిగా బహిర్గతం చేయాలి. ఈ ఘటనలను మీడియా నివేదించే తీరును నిశితంగా పరిశీలిస్తుండాలి. బతికి బయటపడిన బాధితులకు, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలి.వారికి న్యాయం జరిగేలా చూసేందుకు కృషి చేయాలి.
(అక్టోబర్ 16 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)