ని ఉనా మెనోస్... అర్జెంటీనాలో లింగ వివక్షకు, గృహహింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఓ సంస్థ. ఇది 2015లో ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి ఈ సంస్థ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ సంస్థ ఏర్పడి ఈ జూన్ 3 నాటికి ఎనిమిదేండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి మహిళలు చేస్తున్న పోరాటం గురించి నేటి మానవిలో…
మే 2015లో 14 ఏండ్ల చియారా పేజ్‌ను 16 ఏండ్ల మాన్యుయెల్ మన్‌సిల్లా దారుణంగా హత్య చేశారు. దాంతో అక్కడి స్త్రీవాద కార్యకర్తలు, పాత్రికేయులు, కళాకారులు, విద్యావేత్తల బృందం కలిసి ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే ని ఉనా మెనోస్. తమ దేశంలో జరుగుతున్న అన్ని రకాల లింగ ఆధారిత హింసకు ముగింపు పలకాలనే లక్ష్యంతో వీరు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
రెండు లక్షల మందితో మార్చ్
జూన్ 3, 2015న మహిళలపై జరుగుతున్న హింసను ఖండిస్తూ, పితృస్వామ్య భావజాలాన్ని నిరసిస్తూ బాధితులందరికీ న్యాయం చేయాలనే డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా భారీ సమీకరణలకు ఈ ఉద్యమం పిలుపునిచ్చింది. ఆ పిలుపునందుకుని 80 నగరాల్లోని లక్షలాది మంది మహిళలు తమ గొంతు విప్పుతూ, హింసను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చారు. రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో సుమారు రెండు లక్షల మంది ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇది అర్జెంటీనా చరిత్రలోనే మహిళలపై హింసను తిరస్కరిస్తూ జరిగిన అతిపెద్ద మార్చ్‌గా మారింది. అయితే ఈ ఉద్యమం అంతటితో ఆగిపోలేదు.
భారీ కవాతు…
2015 నుండి ప్రతి ఏడాది జూన్ 3న స్త్రీ హత్యలు, ట్రాన్స్ఫెమిసైడ్లు, ట్రావెస్టిసైడ్లు, లైంగిక దాడులు, వేధింపులతో పాటు ఇతర లైంగిక హింసకు వ్యతిరేకంగా, అలాగే సమాన సామాజిక, ఆర్థిక హక్కులను డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం అర్జెంటీనా అంతటా భారీ కవాతులను నిర్వహిస్తున్నది. ఈ ఏడాది సంస్థ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు, లెస్బియన్లు, ద్విలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు మెరుగైన జీవనం, సామాజిక, ఆరోగ్య, విద్యా, న్యాయ వ్యవస్థను డిమాండ్ చేయడానికి ‘ని ఉనా మెనోస్’ మార్చ్‌కు హాజరయ్యారు.
మేము బతకాలనుకుంటున్నాం
”మేము జీవించాలనుకుంటున్నాం. మాకు స్వేచ్ఛ కావాలి. రుణ రహిత సమాజం కావాలి. ఈ న్యాయవ్యవస్థలో ఎవరూ తక్కువ కాదు” అంటూ వేలాది మంది స్త్రీవాదులు, కార్యకర్తలు, వామపక్ష రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంస్థలు, సామాజిక ఉద్యమకారులు, కార్మిక సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అర్జెంటీనా నేషనల్ కాంగ్రెస్‌కు కవాతు చేశారు. పితృస్వామ్య హింసను నిర్మూలించే సమర్థవంతమైన ప్రజా విధానాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హింస పైనే కాదు మహిళలను, ముఖ్యంగా పేదలను ఎక్కువగా ప్రభావితం చేసే ఐఎంఎఫ్ రుణాలను, వాటి వల్ల కలుగుతున్న ప్రతికూల పరిణామాలను సైతం తిరస్కరించారు. న్యాయ వ్యవస్థ వల్ల వస్తున్న ఇబ్బందులు, అడ్డంకులను కూడా ఖండించారు. రక్షణ చర్యలను సమర్థవంతంగా పాటించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం లేదు
”దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన నలభై ఏండ్ల తర్వాత కూడా ఆర్థిక, న్యాయ వ్యవస్థల్లో ప్రజాస్వామ్యం లేదు. విదేశీ రుణం, ఐఎంఎఫ్ నియంత్రణ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ న్యాయ వ్యవస్థ మనది కాదు. అందరికీ జరగనిది న్యాయం కాదు. అందుకే మేము ట్రాన్స్‌ఫెమినిస్ట్, ప్లూరినేషనల్, ఇంటర్ డిసిప్లినరీ న్యాయ సంస్కరణలను డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రజా భాగస్వామ్యంతో కూడిన న్యాయ వ్యవస్థను కోరుకుంటున్నాం. ఇందులో బాధితుల వాదనలు వినబడతాయని హామీ వుంటుంది. బాధితులకు నష్టపరిహారం అందుతుంది” అని సంస్థ బహిరంగంగా ప్రకటించింది.
ఈ భారీ మార్చ్ జరిగిన ముందు రోజు స్త్రీ హత్యలు, అదృశ్యమైన బాధితుల బంధువులు తమ ప్రియమైనవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడానికి ప్లాజా డి మాయోలో సమావేశమయ్యారు. ప్రభుత్వం నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న పోరాటాలు, సాక్ష్యాలను తల్లిదండ్రులు వివరించారు. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, కాంగ్రెస్ అత్యవసరంగా కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
హింస కొనసాగుతోంది
అర్జెంటీనాలో మహిళలపై హింస ప్రధాన సమస్యగా వుంది. ‘నౌ దట్ దే సీ అస్’ అబ్జర్వేటరీ ఇటీవలి నివేదిక ప్రకారం జూన్ 2015 నుండి మే 2023 మధ్య అర్జెంటీనాలో 2,257 స్త్రీ హత్యలు నమోదయ్యాయి. అంటే ఈ ఎనిమిదేండ్లలో ప్రతి 31 గంటలకు ఒక మహిళ హత్యకు గురవుతోంది. 64శాతం మంది మహిళలు వారి భాగస్వాములు లేదా మాజీ భాగస్వాములచే హత్య చేయబడ్డారు. ఈ హత్యలలో 64శాతం బాధితురాలి ఇంట్లోనే జరిగినట్లు కూడా డేటా చూపించింది. మరో నివేదికలో జనవరి 1 నుండి ఏప్రిల్ 30, 2023 మధ్య ఆ దేశంలో 99 స్త్రీహత్యలు, 3 ట్రాన్స్‌ఫెమిసైడ్‌లు, 96 అటెంటెడ్ ఫెమిసైడ్‌లు నమోదయ్యాయని అబ్జర్వేటరీ తెలిపింది. సంస్థ ఎంత పోరాటం చేస్తున్నా మహిళలపై జరుగుతున్న హింస మాత్రం తగ్గడం లేదు. అయినప్పటికీ లింగ హింసను దాని అన్ని రూపాలు నిర్మూలించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి తమ ఉద్యమాన్ని మరింత ఉదృతంగా కొనసాగించాలని వారు నిశ్చయించుకున్నారు.
లాటిన్ దేశాలకు వ్యాప్తి
గత ఎనిమిదేండ్లలో ‘ని ఉనా మెనోస్’ ఉద్యమం విస్తరించింది. మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ఉద్యమంలో భాగస్వాము లయ్యారు. వారి సామాజిక పోరాటాల కోసం ఒక సామూహిక ప్రచారంగా ఈ ఉద్యమం మారింది. ఇది బొలీవియా, చిలీ, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, పరాగ్వే, పెరూ, ఉరుగ్వే వంటి అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో కూడా వ్యాపించింది.
– సలీమ