హక్కుల పరిరక్షణకు మహిళల మహాగర్జన

To protect rights A roar of womenతెలంగాణ రాష్ట్రవ్యాపితంగా ఐద్వా నిర్వహించిన జాతాలు విజయ వంతమయ్యాయి. ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చింది. మహిళల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు. ఐద్వా కార్యకర్తలు ఎర్రంచు తెల్లచీరలు (యూనిఫాం) ధరించి 10నుండి 15మంది చొప్పున దళాలుగా ఏర్పడి రోజుకు 15నుంచి 20 గ్రామాలు, మండల కేంద్రాలలో పర్యటిస్తూ మహిళల స్థితిగతుల్ని వివరించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాలలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. జిఎస్‌టి పేరుతో అల్పాహారం మొదలుకొని ప్రతి వస్తువుపై పన్నులు వేసి ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్నది. మరోపక్క సంపన్నులకు వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము రాయితీల పేరుతో అప్పనంగా ఇవ్వటంపై విస్తృతంగా క్యాంపెయిన్‌ చేశారు. మనుస్మతినే రాజ్యాంగంగా అమలు చేస్తున్న తీరు, ప్రజలు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి మహిళల హక్కుల్ని కాలరాస్తున్న వైనం, పిల్లలు వేసుకునే డ్రస్సుల వలన అత్యాచారాలు జరుగుతున్నాయని పేలేవారి గురించి వివరించాము. స్త్రీల కట్టుబొట్టూపైనా, రాజకీయ ఆర్థిక స్వాతంత్య్రాలపైనా ఆంక్షలు విధించే బీజేపీకి హఠాత్తుగా మహిళలపై ప్రేమ పుట్టుకొచ్చి 33శాతం రిజర్వేషన్‌ బిల్లు తెచ్చిందా? మణిపూర్‌, ఇతర ఘటనల నేపధ్యంలో రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకుని చేసిందా? పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై జనం ఛీకొట్టిన తీరు, మోడీ పాలనకు నూకలు చెల్లాయని ఇంత హడావిడిగా ఈ బిల్లు తెచ్చిందో అర్ధం చేసుకోమని మహిళల్ని, సమాజాన్ని ఆలోచింపజేసే పద్ధతిలో జాతాల ప్రచారం జరిగింది.
ఇక రాష్ట్ర రాజకీయాలను చూస్తే, గత అనేక సంవత్సరాలుగా పేదలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం ధర్నాలు, పోరాటాలు చేయని రోజు లేదు. అయినా కేసీఆర్‌ ప్రభుత్వానికి చలనం కలగకపోగా గుడిసెలు ఖాళీ చేయించే పేరుతో మహిళలపై లాఠీలు ఝలిపిస్తున్నది. కనీస వేతనాల కోసం ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ, ఆశావర్కర్లపై పోలీసుని ఉసిగొలిపి చిత్రహింసలకు గురిచేస్తూ ఉంది. చాలీచాలని జీతాలు, కూలితో కడుపు నింపుకుందామంటే వచ్చే కొద్దిపాటి ఆదాయం సారాయి, మద్యం షాపుల ద్వారా గెద్దలాగా తన్నుకుపోతున్నది. 80శాతం పురుషులు తాగుడుకి బానిసలయ్యారు. తల్లిదండ్రులు, భార్యాబిడ్డల్ని పోషించలేని పరిస్థితుల్లో యువత ఉన్నది. పేదల బతుకులు బతుకులు వీధుల పాలవుతున్నాయి. తాగితాగి రోగాలపాలై ప్రాణాలు పొగోట్టుకుంటున్నా ప్రభుత్వానికి సిగ్గులేదు. పైగా కెేటీఆర్‌ లాంటి యువనాయకుడు లేస్తే అభివద్ధి గురించి మాట్లాడతాడు. ఆచరణ మాత్రం శూన్యం. ఇదే విషయాలు జాతాల్లో మాట్లాడుతుంటే, జనగామ జిల్లాలో తాగుడుకి బానిసలైన సోదరులు, ‘అమ్మా మంచిమాటలు చెప్పారని’ దండాలు పెట్టిన స్థితి. ముఖ్యంగా తెలంగాణ సాయుధ రైతాంగ వీరోచిత పోరాట ప్రాంతాలైన జనగామ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో ప్రయాణిస్తూ ప్రజల్ని చెతన్యం చేస్తూ, మళ్ళీ అటువంటి దోపిడీ శక్తుల్ని తరిమి తరిమి కొడితే తప్ప మహిళల జీవితాల్లో మార్పు సాధ్యం కాదని, మహిళలందరూ ఒక స్వరాజ్యం, ఐలమ్మ, కమలమ్మలు కావాలని జాతా పిలుపునిచ్చింది. సెప్టెంబరు 25న ప్రారంభమైన జాతా 30వ తేదీన ముగిసింది. ఏకకాలంలో 5 జిల్లాల్లో 6 రోజులపాటు 45 మండలాలు, 10 పట్టణ కేంద్రాలలో పర్యటించింది. 110 గ్రూపు మీటింగులలో వేలాదిమంది మహిళలు పాల్గొన్నారు. ప్రసంగాలను ఎంతో శ్రద్ధగా విన్నారు. తదుపరి కార్యక్రమం మహిళల మహా గర్జన చలో ఢిల్లీ. దీన్ని అక్టోబర్‌ 5న నిర్వహించ తలపెట్టాము. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి మహిళలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.
– బి హైమావతి, 9391360886