విజయనగరం : అండర్-19 అంతరాష్ట్ర మహిళల వన్డే క్రికెట్ పోటీల్లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. విజయనగరంలోని చింతలవలస క్రికెట్ అకాడమీలో మహారాష్ట్ర జట్టుతో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు 33.3 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 89 పరుగులు చేసింది. ఈ జట్టును తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో ముంబై బౌలర్ హార్లే గాలా నాలుగు వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు 17.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 92 పరుగులు చేసింది.
8 వికెట్ల తేడాతో ముంబై జట్టు విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్‌అర్ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. బిసిసిఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో టోర్నీ నిర్వహణకు కృషి చేసిన అసోసియేషన్ సభ్యులకు, నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ సిబ్బందిని, జిల్లా క్రికెట్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం టోర్నీ విజేత ముంబై క్రికెట్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. రన్నరప్ మహారాష్ట్ర జట్టు సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో నార్త్ జోన్ క్రికెట్ అకాడమీ చైర్మన్ సన్యాసిరాజు, కన్వీనర్ పి.దేవవర్మ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంఎల్‌ఎన్ రాజు, ట్రెజరర్ పి.సీతారామరాజు పాల్గొన్నారు