పురుషులు పనుల కోసం నగరాలకు వలస వెళుతున్నారు. గ్రామాల్లో మహిళలే వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కానీ వారికి అనువైన వనరులు అందుబాటులో లేవు. ముఖ్యంగా అధునాతన యంత్రాలు చాలా వరకు పురుషులు వాడేందుకే అనుకూలంగా ఉంటున్నాయి. దీని వల్ల వ్యవసాయంలో స్త్రీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. అందుకే మహిళా రైతులకు అనుకూలమైన యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. వాటిని ఉపయోగించి మహిళా రైతులు తమ శ్రమను తగ్గించుకుంటున్నారు. ఆ వివరాలేంటో మనమూ చూద్దాం…
మహిళలు ఎన్నో ఏండ్ల నుండి తృణధాన్యాలను పండిస్తున్నారు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. గడ్డి నుండి ధాన్యాం తీయడం, పొట్టు తొలగించడం, శుభ్రపరచడం, గ్రేడింగ్, పాలిష్, పిండి కొట్టడం ఇలా తృణధాన్యాలు మన దగ్గరకు వచ్చే సరికి ఎన్నో రకాల పనులు ఉంటాయి. ‘ఒకప్పుడు పొలంలో కలుపు మొక్కలను తొలగించడానికి రోజూ ఐదు నుండి ఆరు గంటలు గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడు సైకిల్ వీడర్‌లను ఉపయోగించడం వల్ల మూడు గంటల్లోనే పూర్తి చేయగలుగతున్నాం’ అని భూమ్యా అంటున్నారు. ఈ యంత్రం ద్వారా ఆమె తన శ్రమను తగ్గించుకోగలిగింది. ఒడిశా మిల్లెట్స్ మిషన్ కింద కోరాపుట్‌లోని 10 మంది మహిళా గ్రూపులకు రాగి థ్రెషర్-కమ్-పెర్లర్, క్లీనర్-కమ్-గ్రేడర్, సైకిల్ వీడర్ అందించారు. అయితే వాటిని వాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ల ముందు అనేక సవాళ్లు వచ్చాయి.
మహిళలకు అనుకూలంగా…
కోరాపుట్ బ్లాక్‌లోని మా తారిణి మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యురాలు మాలతీ జాని మాట్లాడుతూ ‘జల్లెడలు తొలగించలేక పోవడంవల్ల రాగి థ్రెషర్-కమ్-పెర్లర్‌ను శుభ్రపరచడం చాలా ఇబ్బందిగా ఉండేది’ అన్నారు. ‘త్రెషర్‌ను తరలించడం కూడా చాలా కష్టం. యంత్రం చాలా బరువుగా ఉంటుంది. దానిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలిం చడానికి ఇతరుల సహాయం అవసరం’ అని మరో సభ్యురాలు పరిమా బద్నాయక్ అన్నారు. ఇటువంటి సవాళ్లు తెరపైకి వచ్చినప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ ఎంపవర్‌మెంట్ 2022లో లింగ నిపుణులను కలుపుకుని లింగ విశ్లేషణ కమిటీ ని ఏర్పాటు చేసింది. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాలు కేవలం పురుషులు ఉపయోగించే విధంగానే తయారు చేయబడుతున్నాయని వారు గమనించారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఆ కమిటీ మహిళా సమాఖ్య సభ్యులు, మహిళా రైతులను సంప్రదించింది. అలాగే ఆ యంత్రంలో కొన్ని మార్పులు సూచించింది. దీని ఆధారంగా తయారీదారులు యంత్రాలను మహిళలు కూడా ఉపయోగించే విధంగా మార్పులు చేశారు.
మహిళా అవసరాలు గుర్తించి
ఉవీవీ కింద పార్టిసిపేటరీ మెషినరీ డెవలప్‌మెంట్ అనేది ఇచ్చిన సూచనలలో ఒకటి. గజపతి, నువాపడ, కెందుఝర్, కోరాపుట్, సుందర్‌ఘర్ జిల్లాలలో గత ఏడాది నుండి ఉవీవీ కింద ప్రచారం చేస్తోంది. మొదటి దశలో 15 గ్రామాలలో 75 మంది మహిళా రైతులకు వారి నిర్దిష్ట అవసరాలు, ప్రాధాన్యతలు గుర్తించి వ్యవసాయ పరికరాలను అందించింది. తర్వాతి దశలలో వీరు ఎక్కువ మంది రైతులను చేరుకుంటారు. అలాగే అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తారు. సైకిల్ వీడర్‌లో క్షితిజసమాంతర హ్యాండిల్‌బార్‌లను ప్రవేశపెట్టిన తర్వాత మహిళ శ్రమ తగ్గింది. ఇప్పుడు వారు దీనిని ఒక చోటు నుండి మరొక చోటికి సులభంగా తరలించవచ్చు.
మహిళా భాగస్వామ్యం ఎక్కువ
భారత్ ప్రపంచంలోనే మిల్లెట్లను అత్యంత ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం. రెండవ స్థానంలో ఉంది. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2023 ప్రకారం భారతదేశం మాత్రమే ఆసియాలో 80% మిల్లెట్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ ఉత్పత్తిలో 20% వాటాను కలిగి ఉంది. వార్షిక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2021-22 ప్రకారం వ్యవసాయంలో అత్యధికంగా 62.9% మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంగా ఉంది. మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఉషా ధరమ్‌రాజ్ మాట్లాడుతూ ‘గ్రామీణ పురుషులు సాధారణంగా ఓరియెంటేషన్, శిక్షణ పొందిన తర్వాత వ్యవసాయ యంత్రాలను ఆపరేట్ చేయడం సులభం. అయితే ఈ విషయంలో మహిళా రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. బరువుగా ఉండటం, స్త్రీలకు అనుకూలం కానందున అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి’ అన్నారు.
ప్రైవేట్ భాగస్వామ్యం
మహిళా రైతులకు వ్యవసాయ పరిష్కారాలను అందించడంలో ప్రైవేట్ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, వాటర్‌షెడ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్‌వర్క్ (వాస్సాన్) ద్వారా స్థాపించబడిన హైదరాబాద్ ఆధారిత సామాజిక సంస్థ ఫార్మ్ ఈజీ చిన్న, సన్నకారు రైతులకు, ముఖ్యంగా మహిళలకు మాన్యువల్ పనిభారాన్ని తగ్గించడానికి వ్యవసాయ పనిముట్లలో వినూత్న సాంకేతికతను ప్రోత్సహిస్తోంది. ‘సరసమైన ధర వద్ద శాస్త్రీయ దృఢత్వంతో రాజీ పడకుండా వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తేవడం మా లక్ష్యం’ అని ఫార్మ్ ఈజీ డైరెక్టర్ గెంబాలి గౌతమ్ అంటున్నారు.
శ్రమను తగ్గించింది
ఫార్మ్ ఈజీ మినీ మిల్లెట్ మిక్సర్ ఫాక్స్‌టైల్, సన్నటి తృణధాన్యాల నుండి పొట్టును సమర్ధవంతంగా తొలగిస్తుంది. జల్లెడ పట్టి ప్రాసెస్ చేస్తుంది. ఇంట్లోనే మిల్లెట్ ప్రాసెసింగ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా అచ్చపువలస గ్రామంలో అరిక ఇస్మెరి (33) మిక్సర్‌తో చాలా సంతోషంగా ఉన్నారు. ‘ఇంతకుముందు మేము మిల్లెట్‌లను చెక్క మోర్టార్‌లో కొట్టి తయారు చేసేవాళ్లం. ఇదెంతో కష్టంగా ఉంటుంది. రెండు కిలోల ధాన్యం సిద్ధం చేయడానికి ఒక పూట పట్టేది. కానీ ఇప్పుడు ఈ మిక్సర్ సహాయంతో గంటలో 4 కిలోల చిన్న మిల్లెట్‌ను ప్రాసెస్ చేయగలం’ అన్నారు. అలాగే ఫార్మ్ ఈజీ ద్వారా ఎర్గోనామిక్‌గా రూపొందించబడిన కాంబో స్ప్రేయర్ పనికి సంబంధించిన అలసట, వెన్ను నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది సౌరశక్తితో పనిచేసేది కాబట్టి విద్యుత్ లేనప్పుడు కూడా దీన్ని ఉపయోగించగలం’ అని ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా తురువాడ మహిళా రైతు పల్లాల సరస్వతి అన్నారు. ఫార్మ్ ఈజీ అనేక ఇతర వ్యవసాయ పరికరాలను రూపొందించింది. ‘ఇందులో కాఫీ కోసం మోటరైజ్డ్ బేబీ పల్పర్, ఫెర్మెంటర్-కంట్రోలర్ ద్వారా బయో-ఇన్‌పుట్‌లను తయారుచేసే సమగ్ర, ఆటోమేటెడ్ సొల్యూషన్, అసమాన భూభాగాలలో నీటిపారుదలని యాక్సెస్ చేసే సోలార్ ఎనర్జీ మొబైల్ కార్ట్‌లు కూడా ఉన్నాయి’ అని హైదరాబాద్‌కు చెందిన వాసన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గిజివిషా ఖత్రీ చెప్పారు.
విధానపరమైన ఆందోళనలు
‘మారుతున్న పరిస్థితులతో పురుషులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళుతున్నారు’ అని పద్మశ్రీ గ్రహీత, లింగ వివక్ష, పునరుత్పత్తి వ్యవసాయంపై ఒడిశాలోని నయాగర్ జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థ సంభవ్ వ్యవస్థాపక సభ్యురాలు సబర్మతీ అన్నారు. ‘గ్రామాలలో మహిళలు వ్యవసాయ భారాన్ని చాలా మోస్తున్నారు. పొలాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. కానీ మహిళల ఎర్గోనామిక్స్, లింగ అవగాహన ఆధారంగా పరికరాలను రూపొందించడంలో చాలా తక్కువ ప్రయత్నం జరుగుతోంది’ అని ఆమె జోడించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానంగా ఉత్పాదక వనరులు అందుబాటులో ఉంటే వారు తమ పొలాల్లో దిగుబడిని 20 నుండి 30% పెంచగలరు. దీనివల్ల ప్రపంచంలో ఆకలితో ఉన్న వారి సంఖ్య 100 నుండి 150 మిలియన్లకు తగ్గుతుంది.
ఇప్పుడు సులభంగా ఉంది
సాధారణంగా మహిళలు కలుపు మొక్కలను ఏరివేయడానికి గంటల తరబడి వంగి ఉంటారు. అయితే ఈ యంత్రం వచ్చిన తర్వాత నేలలోకి చొచ్చుకుపోయి కలుపును తొలగించి వేస్తుంది. అదేవిధంగా నూర్పిడి యంత్రానికి కూడా చక్రాలు ఉన్నాయి. ‘మేము దాన్ని ఇప్పుడు సులభంగా వాహనంలో ఎక్కించవచ్చు. పొలంలోకి, మారుమూల గ్రామాలకు కూడా రవాణా చేయవచ్చు’ అని బద్నాయక్ ఆనందంగా చెబుతున్నారు. ‘జల్లెడలు ఇప్పుడు తీసి మళ్లీ అమర్చుకోవచ్చు. దీనివల్ల మేము తక్కువ సమయంలో యంత్రాన్ని సులభంగా శుభ్రం చేయవచ్చు’ అని ఆమె పంచుకున్నారు.
కొత్త మార్గాలను అన్వేషించాలి
తెలంగాణలో మహిళా కిసాన్ అధికార్ మంచ్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనంలో ఎక్కువ మంది మహిళా రైతులు చేతితో వ్యవసాయం చేయడం వల్ల శరీర నొప్పులు, కండరాల కణజాల రుగ్మతలతో బాధపడుతున్నారని వెల్లడైంది. ‘పార్టిసిపేటరీ విధానం ద్వారా యంత్రాల రూపకల్పన, అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. మహిళా రైతులు, వృద్ధులను చేర్చుకోవడం, వారి సూచనలను పొందుపరచడం చాలా అవసరం’ అని జాతీయ సులభతర బృందం సభ్యుడు డాక్టర్ వి.రుక్మిణి రావు అంటున్నారు.