రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యంజైపూర్‌: మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి ఒక చారిత్రాత్మక బిల్లును భారతదేశం తన కొత్త పార్లమెంటులో మొదటి రోజునే ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే ప్రతిపాదనా ఉంది. దీని తర్వాత అసెంబ్లీ, లోక్‌సభ రెండింటిలోనూ మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చినట్లు పలువురు చెబుతున్నారు. అయితే ఇది అమలు కావడానికి దాదాపు ఏడెనిమిదేండ్లు పడుతుంది. అలాంటి పరిస్థితిలో ఎన్నికల రాష్ట్రమైన రాజస్థాన్‌ అసెంబ్లీలో మహిళల భాగస్వామ్యం ఇప్పటి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం.
1972 అసెంబ్లీ ఎన్నికల్లో…. ఏడుగురు మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 13 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అప్పట్లో రాజస్థాన్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళా ఓటర్ల నిష్పత్తి 723గా ఉండేది. అయితే 1977 అసెంబ్లీ ఎన్నికల్లో 31 మంది మహిళా అభ్యర్థుల్లో కేవలం ఒక మహిళా అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఆ ఏడాది వెయ్యి మంది పురుషులకు 763 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు.
1980 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 31 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 10 మంది అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో మొత్తం 45 మంది మహిళలు పోటీ చేయగా 17 మంది మాత్రమే గెలుపొందారు. ఆ ఏడాది వెయ్యి మంది పురుషులకు 728 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు.
1990 అసెంబ్లీ ఎన్నికల్లో… 93 మంది మహిళలు టిక్కెట్లు పొందగా అందులో 11 మంది మాత్రమే గెలుపొందారు. అప్పుడు వెయ్యి మంది పురుషులకు 736 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు. మూడేండ్ల తరువాత 1993లో మళ్లీ ఎన్నికలు జరిగాయి, ఇందులో మొత్తం 97 మంది మహిళలు పోటీ చేయగా 10 మంది మాత్రమే గెలిచారు. అప్పుడు వెయ్యి మంది పురుషులకు 755 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 1998లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది మహిళా అభ్యర్థులుండగా.. కేవలం 14 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పుడు వెయ్యి మంది పురుషులకు 786 మంది మహిళా ఓటర్లు మాత్రమే ఉన్నారు.
2003 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 118 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుచోగా కేవలం 12 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 841 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2008లో మొత్తం 154 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేయగా, వారిలో 28 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. ఆ సమయంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 874 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో…166 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 28 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. అప్పట్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 899 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 189 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. కేవలం 24 మంది మాత్రమే గెలిచారు. అయితే ఆ తర్వాత వీరి సంఖ్య 27కి పెరిగింది.
ఏ పార్టీ నుంచి ఎంతమంది మహిళా అభ్యర్థులు ..
పార్టీల వారీగా లెక్కల ప్రకారం చూస్తే, 2018లో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 సీట్లలో కాంగ్రెస్‌ 27 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. ఇందులో 12 మంది మహిళలు విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ మొత్తం 23 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, కేవలం 10 మంది మాత్రమే విజయం సాధించారు. ప్రస్తుతం రాజస్థాన్‌ అసెంబ్లీలో మొత్తం 27 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో కాంగ్రెస్‌ నుంచి 15 మంది, బీజేపీ నుంచి 10 మంది, ఆర్‌ఎల్‌పీ నుంచి ఒక ఎమ్మెల్యే, స్వతంత్ర మహిళా ఎమ్మెల్యే ఉన్నారు.