రోడ్లపై నాట్లు వేసి మహిళల నిరసన

రోడ్లపై నాట్లు వేసి మహిళల నిరసననవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని పస్రా గ్రామంలో అభ్యుదయ కాలనీ మహిళలు బురదమయమైన రహదారిపై వరినాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కాలనీలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వీధులన్నీ బురదమై ఉన్నాయని, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం వల్ల మురుగునీరుతో దోమలు ఆశించి రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వరి పొలాల నాట్లను తలపించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చినుకు పడిందంటే అభ్యుదయ కాలనీ చిత్తడిగా మారుతుందని, తమ కాలనీ రోడ్ల పరిస్థితిని పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ కాలనీకి సీసీ రోడ్లు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రామ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ తమ కాలనీలో సీసీ రోడ్డు వేసేందుకు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీసీ రోడ్డు నిర్మించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.