మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసను రూపుమాపాలని ఐక్యరాజ్య సమితి 2000 ఫిబ్రవరి 7న ఒక తీర్మానం చేసింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి యేడాది నవంబర్ 25 వ తేదీనుండి డిసెంబరు 10 వరకూ స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వివిధ దేశాల్లో మహిళల హక్కుల కోసం అనేక సంస్థలు పని చేస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మహిళలు, మైనార్టీలు, దళితులు, గిరిజనలు, ఆదివాసీలకు హక్కులు ఇంకా అందని ద్రాక్షగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మతోన్మాదుల పాలనలో పరిస్థితి మరింత దిగజారింది. నేడు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళా హక్కులు, వాటి అమలు గురించి తెలుసుకుందాం…
ప్రసూతి ప్రయోజనాల చట్టం
మెటర్నటీ బెనిఫిట్ చట్టం ప్రకారం మహిళల డెలివరీ తర్వాత ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. ఈ కాలంలో వారి జీతంలో ఎలాంటి మినహాయింపు ఉండదు. తర్వాత తిరిగి పనిలో చేరే హక్కును కూడా ఉంటుంది.
రాత్రిపూట అరెస్టు హక్కు
1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 46లోని సబ్‌సెక్షన్(4) ప్రకారం ఏ పోలీసు అధికారి సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి సమయంలో స్త్రీలను అరెస్టు చేయరాదు. మహిళ ఏ చట్టాల్ని ఉల్లంఘించినా పోలీసులు ఉదయం వరకు వేచి ఉండాల్సిందే. అలాగే ఒక మహిళను అరెస్టు చేయాలంటే పోలీసులు ముందుగా కోర్టు నుండి ప్రత్యేక అధికారం పొందాలి.
ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు
అత్యాచారం లేదా లైంగిక వేధిపులకు గురైన మహిళలకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కును భారత రాజ్యాంగం ఇచ్చింది. బాధిత మహిళ పోలీసు స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ నుండి సహాయం పొందవచ్చు. న్యాయవాదిని ఏర్పాటు చేయడానికి ఎస్‌హెచ్‌ఓ చట్టపరమైన అధికారాన్ని తెలియజేస్తుంది.
పేరు, గుర్తింపును గోప్యంగా ఉంచే హక్కు
మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. అత్యాచారం లేదా లైంగిక వేధింపుల విషయంలో బాధితురాలి పేరు, ఫొటోను గోప్యంగా ఉంచే హక్కు ఉంది. లైంగిక వేధింపుల విషయంలో గోప్యతను కాపాడేందుకు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే హక్కు ఉంటుంది. మహిళలు తమ ఫిర్యాదులను నేరుగా జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసుకోవచ్చు. అలాగే మహిళ ఎవరనే విషయాన్ని వెల్లడించే హక్కు పోలీసులకు, మీడియాకు, అధికారులకు లేదు.
సమాన వేతన హక్కు
మహిళలకు సమాన వేతనం పొందే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. సమాన వేతన చట్టం ప్రకారం, లింగం ఆధారంగా వేతనాలలో ఎలాంటి వివక్ష ఉండదు. సమాన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని నిబంధన ఉంది.
హక్కులను కాలరాస్తున్నారు
అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలలో భాగంగా దేశంలో సగభాగంగా ఉన్న మహిళల హక్కులే మానవ హక్కులని 1975లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని సాధించి, మహిళల హక్కుల్ని రాజ్యం హరించకుండా పాలన ఉన్నప్పుడు మహిళల హక్కులే మానవ హక్కులుగా వర్ధిల్లుతాయి. భారత రాజ్యాంగంలో మహిళకు చట్ట రూపంలో హక్కులు ఉన్నప్పటికీ పురుషాధిక్యత వల్ల చట్టం ధనవంతుల చుట్టంగా మారింది. అడుగడు గునా మహిళా హక్కుల్ని కాలరాస్తూనే ఉన్నారు. 1995లో బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సు మహిళా సాధికారిత సాధిస్తేనే మానవ హక్కులు రక్షింపబడతాయని చెప్పింది. అయితే పాలకులు రాజ్యాధికారంలో మహిళల భాగస్వా మ్యం పెంచడం, మహిళా చట్టాల్ని కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా చట్ట వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. అలాగే సాంఘిక, ఆర్థిక రాజకీయ రంగాలలో స్త్రీలు సమాన భాగం పంచుకునే అవకాశం కల్పించాలి. విద్య, వైద్య రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. స్త్రీలపై, అమ్మాయిలపై జరుగుతున్న అన్ని రకాల వివక్షలను, హింసను రూపుమాపడం, పౌర సమాజంలో స్త్రీ చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళా సాధికారిక సాధ్యమవుతుంది. కనుక మహిళల హక్కులే మానవ హక్కులను చాటి చెబుదాం.
– నేదునూరి జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
భారత జాతీయ మహిళా సమాఖ్య
హక్కులను నీరుగార్చే ప్రయత్నం
భారత దేశంలో మానవ హక్కులు క్షీణిస్తున్నాయని ఇటీవల అనేక సర్వేలలో తేలింది. మానవ హక్కుల సూచీలో మన దేశం ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాలలో 109వ స్థానంలో ఉంది. మహిళల హక్కుల పరిస్థితి ఇంకా దిగజారుతోంది. దేశంలో మహిళలపై రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదికలే చెప్తున్నాయి. భారత దేశం మహిళలకు అత్యంత ప్రమాదక రమైన దేశాల జాబితాలోకి చేరడం ఆందోళన కలిగిస్తోంది. బేటీ బచావో అని చెప్పే ప్రభుత్వం, రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తెచ్చి మహిళలు అనేక ఏండ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను నీరు గార్చే ప్రయత్నాలలో ఉంది. ఆడ పిల్లలకు ఇంటా బయట ఎక్కడా రక్షణ లేదు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల కమిటీలు ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా ఎక్కడా అవి ఉనికిలో లేవు. కోల్కతా ఆర్జీకార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన ఘోర ఉదంతం మహిళల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ దేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు దౌర్జన్యాలకు పాల్పడే ప్రముఖులకు కొదవే లేదు. బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్ , డేరా బాబా, ప్రజ్వల్ రేవన్న, కుల్దీప్ సింగ్ సేనవార్ లాంటి అనేక పలుకుబడి కలిగిన పెద్దలపై ఏండ్ల తరబడి పోరాడినా బాధితులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాలు ఊరికే ఇచ్చే నినాదాలు మానుకొని మహిళలపై పెరుగుతున్న హింసను దౌర్జన్యాలను అరికట్టి దేశ పరువు ప్రతిష్టలను నిలబెట్టేందుకు ఇప్పటికైనా పూనుకోవాలి.
– నాగలక్ష్మి, ఐద్వా రాష్ట్ర నాయకులు
హక్కులను రక్షించడం సమిష్టి బాధ్యత
బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి చేసి అందించిన రాజ్యాంగం పూర్తిగా హక్కులతో కూడుకున్నది. దాన్ని కాపాడుకుంటూ అందరికీ సమానత్వం, న్యాయం, గౌరవం దక్కడానికి కృషి చేయాలి. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం మన సమిష్టి బాధ్యత. ముఖ్యంగా శ్రామిక మహిళలకు సాధికారత కల్పించడం అత్యవసరం. అప్పుడే మానవుల సాధికారతకి అర్థం ఉంటుంది. అందరూ సమానత్వంతో ఉండే రేపటి కోసం అట్టడుగు వర్గాలకు తోడుగా నిలబడాలి. స్వేచ్ఛా, సమానత్వం, న్యాయం కోసం మనందరం నిరంతరం పని చేయాలి.
– సుజాత సూరేపల్లి.
సమానత్వం ప్రధానం
1948, డిసెంబర్ 10వ తేదీన సార్వజనీన మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్)ను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ మానవ హక్కుల ప్రకటన రూపొందించిన కమిటీకి నేతృత్వం వహించింది ఓ మహిళే. ఆమే ఎలానేర్ రూజ్వెల్ట్. మానవ హక్కులలో అత్యంత ప్రధానమైనది సమానత్వం. కానీ మహిళల విషయంలో ఇది ఇంకా నెరవేరలేదు. దళిత, ఆదివాసీ మహిళల విషయంలో మరీ ఘోరంగా వుంది. నేటికీ వారిపై అత్యాచారాలు ప్రతి నిత్యం జరుగుతూనే వున్నాయి. మానవ హక్కులు ఆడవారికి సమానత్వం ఇవ్వాలని 1995లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో బీజింగ్‌లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఆ తర్వాత 30 ఏండ్ల తర్వాత నవంబర్ 2024న బ్యాంకాక్‌లో ఐక్య రాజ్య సమితి మరల సమావేశం అయింది. మహిళా సమానత్వమే గొప్పది అని తీర్మానించింది. ఈ సమావేశాలకు భారత దేశం నుంచి నేను కూడా హాజరయ్యాను. మన దేశంలో దళిత ఆదివాసీ మహిళల కష్టాల గురించి వివరించాను.
– ఝాన్సీ గెడ్డం, దళిత స్త్రీ శక్తి నాయకురాలు