– విద్వేష రాజకీయాలను విద్యార్థులు తిప్పికొట్టారు
– వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధనంజయ్
న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘానికి జరిగిన ఎన్నికల్లో వామపక్ష కూటమి క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ ప్యానల్‌లోని మొత్తం నాలుగు స్థానాలూ ఈ కూటమికే దక్కాయి. అధ్యక్ష పదవిని గెలుచుకున్న ధనంజరు బీహార్‌లోని గయకు చెందిన వారు. 1996-97లో గెలుపొందిన బట్టిలాల్ బైర్వా తర్వాత వామ పక్ష కూటమి నుంచి విజయం సాధించిన తొలి దళిత అధ్యక్షుడు ఆయనే. జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నికైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) నేత ధనంజరు పీటీఐ వార్తా సంస్థతో ముచ్చటించారు. ఈ విజయం జేఎన్‌యూ విద్యార్థులు ఇచ్చిన తీర్పు అని ఆయన వ్యాఖ్యానించారు. విద్వేష, హింస రాజకీయాలను విద్యార్థులు తిరస్కరించారని చెప్పారు. వారు తమపై మరోసారి విశ్వాసాన్ని ఉంచారని, దానిని నిలబెట్టుకుంటామని, వారి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తా మని, విద్యార్థులకు సంబంధించిన అంశాలపై కృషి చేస్తామని తెలిపారు.
‘క్యాంపస్‌లో మహిళల భద్రత, నిధుల కోత, స్కాలర్‌షిప్పుల పెంపు, మౌలిక సదుపాయాలు, నీటి సంక్షోభం వంటి అంశాలకు విద్యార్థి సంఘం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆయా సమస్యల పరిష్కారానికి ముందుగా చర్యలు చేపడతాం’ అని ధనంజరు చెప్పారు. కాగా లాల్ సలామ్, జై భీమ్ నినాదాల మధ్య విజేతలైన నేతలను మద్దతుదారులు అభినందించారు. తాము బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో ఆనందంతో ఎరుపు, తెలుపు, నీలం పతాకాలను ఎగరేశారు. ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన అవిజిత్ ఘోష్ ఉపాధ్యక్షుడుగా, వామపక్ష కూటమి మద్దతుతో పోటీ చేసిన బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ యూనియన్ (బాప్సా) అభ్యర్థి ప్రియన్షి ఆర్యా ప్రధాన కార్య దర్శిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన వామపక్ష కూటమి అభ్యర్థి స్వాతి సింగ్ నామినేషన్‌ను ఎన్నికల కమిటీ రద్దు చేయడంతో ఆ కూటమి బాప్సా అభ్యర్థి ఆర్యకు మద్దతు ప్రకటించింది. సంయుక్త కార్యదర్శి పదవిని లెఫ్ట్ అభ్యర్థి మహమ్మద్ సాజిత్ గెలుచుకున్నారు.
ఈ విజయంతో జేఎన్‌యూ వామపక్షాలకు కంచుకోట అని మరోసారి రుజువైంది. కౌంటింగ్ ప్రారంభంలో వామపక్ష కూటమికి, బీజేపీ అనుబంధ ఏబీవీపీకి మధ్య హోరాహోరీ పోరు సాగింది. సెంట్రల్ ప్యానల్‌లోని నాలుగు పదవుల్లోనూ ఏబీవీపీ అభ్యర్థులే ఆధిక్యత కనబరిచారు. అయితే ఆ తర్వాతి రౌండ్లలో వామపక్ష కూటమి పుంజుకొని విజయభేరి మోగించింది. యునైటెడ్ లెఫ్ట్ ప్యానల్‌లో ఏఐఎస్‌ఏ, డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ భాగస్వాములుగా ఉన్నాయి. గత 12 సంవత్స రాలలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో 73శాతం ఓట్లు పోలయ్యాయి. 2019లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన అయిష్ ఘోష్ అధ్యక్షుడుగా విజయం సాధించిన విషయం తెలిసిందే.