మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యం

మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యం– మహిళలను వేధించే వారిమీద ఉక్కుపాదం : రాచకొండ సీపీ తరుణ్‌ జోషి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళల భద్రతకు ప్రథమ పాధాన్యత ఇస్తున్నామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గురువారం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సీపీ సందర్శించి రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే షీటీమ్స్‌ బిల్డింగ్‌తోపాటు ఈ చలాన్‌ ఆఫీస్‌ను తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్‌ సరూర్‌నగర్‌లోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు. బాధితులు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా పని వాతావరణం ఉండాలన్నారు. ట్రాఫిక్‌ ఈ-చలాన ఆఫీసు సిబ్బంది పనితీరును పరిశీలించారు. వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ప్రయాణాల్లో, పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుంచి రక్షణ కోసం షీటీమ్స్‌ బృందాలు అన్ని వేళలా అందు బాటులో ఉంటాయన్నారు. హింస, నిరాదరణ ఎదుర్కొంటూ పోలీస్‌ స్టేషన్‌కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్‌ కంట్రోల్‌ రూమ్‌ 8712662111 నెంబర్‌కిగానీ, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించి న్యాయం చేకూరు స్తామని చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌ కుమార్‌, డీసీపీ వుమెన్‌ సేఫ్టీ ఉషా విశ్వనాథ్‌, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసులు, ఏసీపీ వెంకటేశం ఉన్నారు.