ఇండియాలో మహిళా గొంతు

Women's voice in Indiaఈ నెల 4న 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పదేండ్ల తర్వాత బలమైన ప్రతిపక్షం ఏర్పడింది. భారత జాతీయ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్‌డీఏపై పోరాడారు. మొత్తం 232 స్థానాలను గెలుచుకోగలిగారు. ప్రతిపక్షాలు చేసిన ఈ పోరాటంలో మహిళా అభ్యర్థులు సైతం పెద్దఎత్తున విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 30 మందికి పైగా విజయం సాధించారు. వీరిలో చాలా మంది అట్టడుగు, మైనారిటీ వర్గాలకు చెందినవారు సైతం ఉన్నారు. వారి పరిచయాలు నేటి మానవిలో…
కడియం కావ్య
తెలంగాణలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈమె ప్రముఖ వైద్యురాలు అలాగే సమాజిక కార్యకర్త. కడియం ఫౌండేషన్‌ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. కావ్య మాజీ ఎంపీ కడియం శ్రీహరి కుమార్తె.
డాక్టర్‌ ప్రభా మల్లికార్జున్‌, ప్రియాంక జార్కిహోళి
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో డాక్టర్‌ ప్రభా మల్లికార్జున్‌, ప్రియాంక జార్కిహోళి వరుసగా దావణగెరె, చిక్కోడి నియోజ కవర్గాల నుండి విజయం సాధించారు. ప్రియాంక పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ మంత్రి సతీష్‌ జార్కిహోళి కుమార్తె కాగా, డాక్టర్‌ ప్రభ గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌ భార్య.
ఇక్రా మునవర్‌ హసన్‌
ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కైరానా నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి బీజేపీకి చెందిన ప్రదీప్‌ కుమార్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన శ్రీపాల్‌పై 69,116 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఈమె లండన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీడ్‌లో, ఇంటర్నేషనల్‌ లాలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. ఇక్రా రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత మునవ్వర్‌ హసన్‌ కుమార్తె. 28 ఏండ్ల ఇక్రా స్త్రీవాది. ఆమె తన కుటుంబం సేవా వారసత్వాన్ని నిలబెట్టడానికి ఈ ఎన్నికల్లో పోరాడింది. మహిళా సమస్యలు పరిష్కరించాలని, మతం పేరుతో ప్రజల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించాలని ఆమె బలంగా కోరుతుంది. యూపీలో తాను ప్రధానంగా రైతులు, మహిళల విద్యపై దృష్టి పెడతా అంటుంది.
వర్షా ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌
మహారాష్ట్రలోని ముంబై నార్త్‌ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఉజ్వల్‌ నికమ్‌పై గట్టిపోటీనిచ్చిన దళిత మహిళా నాయకురాలు వర్ష ఏక్నాథ్‌ గైక్వాడ్‌. 16,514 ఓట్ల తేడాతో గెలుపొందారు. వర్షా తాయి అని ప్రజలు ఆమెను ప్రేమగా పిలుచుకునే. శివసేన మద్దతు పొందిన వర్షా, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం నుండి గెలిపొందిన ఏకైక కాంగ్రెస్‌ అభ్యర్థి. చాలా మంది రాజకీయ పరిశీలకులు వర్షా గెలుపును ‘అన్ని అసమానతలకు వ్యతిరేకంగా’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ కుమార్తె అయిన వర్ష 2009-2010 మధ్య కాలంలో మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సామాజిక సేవకురాలిగా కూడా ఆమెకు అక్కడ మంచి గుర్తింపు ఉంది.
ప్రియా సరోజ్‌
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన అతి పిన్న వయస్కురాలు ప్రియా సరోజ్‌. ఆమె సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్‌ స్థానం కోసం పోరాడారు. సరోజ్‌ మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన తూఫాని సరోజ్‌ కుమార్తె అలాగే ప్రాక్టీస్‌లో ఉన్న న్యాయవాది. ఆమె 35,850 ఓట్ల తేడాతో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ భోలానాథ్‌పై విజయం సాధించారు. ఈ స్థానం నుండి 12 మంది పోటీలో ఉన్నారు. వీరిలో బీఎప్సీకి చెందిన కృపా శంకర్‌ సరోజ్‌ 157,291 ఓట్లు పొందారు. మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులు
నాలుగు అంకెలను దాటలేకపోయారు.
మిసా భారతి
ఆర్‌జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె ఈమె. కేంద్ర మంత్రి, బీహార్‌లోని పాటలీపుత్ర నుండి ప్రస్తుత ఎంపీ రామ్‌ కృపాల్‌ యాదవ్‌పై 85,174 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతకుముందు రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. పాట్నా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో కలిసి ఉండే పాటలీపుత్ర సీటు కోసం 2009లో పోటీ చేసి లాలూ యాదవ్‌ గెలిచారు.
జెనిబెన్‌ నాగాజీ ఠాకూర్‌
ఈమె బనస్కాంత లోక్‌సభ నుండి 30,000 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన రేఖా చౌదరిని ఓడించి విజయం సాధించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే లభించినప్పటికీ మొత్తం 26 స్థానాలను వరుసగా మూడోసారి కైవసం చేసుకోవాలనే బీజేపీ ఆశయాన్ని దెబ్బతీసిన ఠాకూర్‌ విజయం కీలకమైంది. వాస్తవానికి బనస్కాంత బీజేపీకి ఓ బలమైన కోట. రాహుల్‌ గాంధీని ఎంపీగా సస్పెండ్‌ చేసినందుకు నిరసనగా గత ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ నుండి సస్పెండ్‌ చేసిన 16 మంది ఎమ్మెల్యేలలో ఠాకూర్‌ కూడా ఒకరు. ఫిబ్రవరి 2024లో, రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వ కార్యాలయాల గురించి మాట్లాడినందుకు ఠాకూర్‌తో పాటు మరో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను మళ్లీ సస్పెండ్‌ చేశారు. ఇటువంటి ఆటంకాల మధ్య ఆమె సాధించిన విజయం నిజంగా గొప్పది.
మహువా మొయిత్రా
పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ స్థానం నుండి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహువా మొయిత్రా 56,705 ఓట్లతో జనతా పార్టీ ప్రత్యర్థి అమృతా రారుపై విజయం సాధించారు. ఇది ఆమెలోని స్థైర్యానికి, ఆమెపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. మహువా జూన్‌ 26, 2010న పార్లమెంటులో ‘ఫాసిజం సంకేతాలు’పై చేసిన తొలి ప్రసంగం సోషల్‌ మీడియాలో ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీల మధ్య అనుబంధంపై ఆమె అనేక ప్రశ్నలు లేవనెత్తారు. దాంతో బీజేపీ పార్టీ ఆమె గొంతు నొక్కేందుకు 2023లో ఎంపీ పదవి నుండి బహిష్కరణకు గురి చేసింది. అయినా ఆమె ఎక్కడా తగ్గలేదు. ప్రజల మద్దతుతో తిరిగి పార్లమెంటులో అడుగుపెడుతుంది. ఈ విజయం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, ప్రశ్నించే గొంతును అణిచివేసే వారికి ప్రజలిచ్చిన సమాధానంగా ఆమె అంటున్నారు.
సుప్రియా సూలే
శరద్‌ పవార్‌ కుమార్తె నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సుప్రియా సూలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో విడిపోయిన కుటుంబ సభ్యులపై పోటీ చేయడాన్ని, తన పార్టీ పేరు, గుర్తును లాక్కోవడం నుండి అనేక సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. అయితే చివరికి ఆమె తన బారామతి లోక్‌సభ స్థానం నుండి 1.55 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. సూలే వరుసగా నాలుగోసారి తన స్థానాన్ని గెలుచుకోగలిగారు. ఈమె పార్లమెంటులో భ్రూణహత్యల వంటి అనేక సమస్యలపై అలాగే ూ+దీుQ×Aం హక్కులకు బలమైన మద్దతునిచ్చారు.
కనిమొళి
తమిళనాడులోని తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అభ్యర్థి కనిమొళి కరుణానిధి 5,40,729 ఓట్లు సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు. ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి కుమార్తె. కేంద్రంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల్లో ఆమె విశ్రాంతి లేకుండా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.