– మంథనిలో అత్యధిక సంఖ్యలో మగువ ఓటర్లు
– అభ్యర్థుల భవితత్వం వారి చేతుల్లోనే
నవతెలంగాణ-మల్హర్ రావు : మగువా..మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువా. అన్న సినీ గేయాన్ని మగువా మగువా అభ్యర్థికి తెలుసా నీ విలువ అని మంథని నియోజకవర్గంలో పాడుకోవడం అతిశయోక్తి కాదేమోనిపిస్తోంది.ఎందుకంటే మంథని నియోజకవర్గంలో సగానికిపైగా మహిళ ఓటర్లే ఉన్నారునియోజకవర్గంలో 9 మండలాల్లోని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పురుషులను వెనక్కినెట్టి ఓటుహక్కులో ముందున్నారు.మంథని అభ్యర్థులు భవిత నారిమణుల చేతుల్లోనే ఉందని చెప్పడంలో సందేహం లేదు.ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉందనట్లు, ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి విజయం వెనుక కచ్చితంగా మహిళ ఓటర్లు ఉంటారు.దీంతో మహిళ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి.
51 శాతం మహిళలే…
ఈ నెల 4న అధికారులు ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం మంథని నియోజకవర్గంలో 2,30,,306 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,13,828 పురుషులు,1,16,458 మంది స్ర్తిలు, 20మంది ఇతరులు ఉన్నారు.ఓటర్లలో మొత్తం 51 శాతం మహిళలే ఉన్నారు.ఇక మండలాలు,గ్రామాల్లో చూసినా మహిళలే ముందజలో ఉన్నారు.దీంతో అభ్యర్థులు భవిత మహిళ ఓటర్ల తోపాటు యువత ఓటర్ల చేతిలోనే ఉంది.
పెరిగిన నూతన ఓటర్లు 23,591..
2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి భారీగా నూతన యువత ఓటర్లు పెరిగారు.ఇటీవల అధికారులు ప్రకటించిన తుది జాబితా లెక్కల ప్రకారం మంథని నియోజకవర్గంలో 23,591 మంది యువత ఓటర్లు పెరిగినట్లు అధికారులు ప్రకటించారు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,10,232 ఉండగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,16,715 ఉండగా తాజాగా 2,30,306 ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఓటర్లలో సైతన్యం రావాలి…..చింతల తిరుమల.. గృహిణి
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఓటుహక్కు కల్పించింది.ఈ అవకాశాన్ని ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి.మహిళలు ఓటు వేయడంలో చైతన్యం చూపాలి.
సద్వినియోగం చేసుకోవాలి…చొప్పరి లక్ష్మీ…గృహిణి.
ప్రజాసమస్యలు పరిష్కరించే నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుహక్కు వజ్రాయుధంలాంటిది.పోలింగ్ రోజున సెలవు రోజుగా భావించకుండా ఓటు వేయాలి.మహిళలు,పురుషులు ప్రతిఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి.