మాటలు ఘనం… చేతలు శూన్యం

Words are solid...hands are empty– బీజేపీలో మహిళలకు ప్రాతినిధ్యం ఏది?
–  కీలక పదవులన్నీ పురుషులకే
మహిళా సాధికారత గురించి బీజేపీ సుద్దులు చెబుతూ ఉంటుంది. కానీ తాను మాత్రం ఆ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. ‘ఎదుటి మనిషికి చెప్పేటం దుకే నీతులు ఉన్నాయి’ అని ఓ కవి అన్న మాటలు ఆ పార్టీకి అక్షరాలా వర్తిస్తాయి. వాస్తవానికి బీజేపీ నిర్మాణంలో పురుషులదే పెత్తనం. జాతీయ కార్యవర్గంలో మహిళలకు మూడో వంతు కోటా ఇవ్వాలంటూ ఆ పార్టీ తన సొంత రాజ్యాంగంలో నిర్దేశించుకుంది. కానీ ఆచరణలో మాత్రం మొండిచేయి చూపుతోంది.
ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గంలో 90 మంది సభ్యులు ఉండగా వారిలో మహిళల సంఖ్య కేవలం 14 మాత్రమే. అంటే 15.56% అన్న మాట. 2021లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అందులో 80 మంది సభ్యులు ఉండేవారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, పీయుష్‌ గోయల్‌ వంటి సీనియర్‌ నేతలకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పిం చారు. 2022 డిసెంబర్‌లో మరో ముగ్గురికి (అందరూ పురుషులే) చోటు దక్కింది. ఈ సంవత్సరం జూలైలో మళ్లీ కార్యవర్గాన్ని విస్తరి ంచారు. ముగ్గురిని తొలగించి, పది మందిని చేర్చుకు న్నారు. అయితే వీరిలో ఒక్క మహిళ కూడా లేరు.
జాతీయ కార్యవర్గంలోనే కాదు…ఇతర విభాగాలలో నూ లింగ అసమానతలు చోటుచేసుకున్నాయి. పద కొండు మంది సభ్యులున్న పార్లమెంటరీ బోర్డులో కేవలం ఒక్కరంటే ఒక్క మహిళ మాత్రమే ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీలోని 15 మంది సభ్యులలో ఇద్దరు మహిళలకు మాత్రమే స్థానం లభించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న 36 మందిలో ఇద్దరు మాత్రమే మహిళలు.
ఇక పార్టీకి చెందిన ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులూ పురుషులే. పార్టీకి 12 మం ది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ప్రాతి నిధ్యం వహిస్తుండగా వారిలో ఒక్క మహిళ కూడా లేరు. మొత్తం మీద పార్టీకి చెందిన వివిధ విభాగాలలో పని చేస్తున్న వారు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్న వారు 1973 మంది ఉండగా వారిలో 231 మంది (11.71%) మహిళలు.
1980లో బీజేపీ అవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకూ 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేయగా ఇప్పటి వరకూ ఆ పదవిని మహిళలెవ్వరూ నిర్వహించలేదు. సుష్మా స్వరాజ్‌, వసుంధర రాజె, ఉమాభారతి వంటి సీనియర్‌ నాయకులు ఉన్నప్పటికీ వారెవరినీ ఆ పదవి వరించలేదు. బీజేపీలో అధ్యక్షుడి తర్వాత అతి ముఖ్యమైన పదవి జాతీయ ప్రధాన కార్యదర్శి. అయితే ఇప్పటి వరకూ ఆ పదవి కూడా మహిళలకు దక్కలేదు. అయితే బీజేపీ నేతలు మాత్రం మహిళలకు తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెబుతుంటారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేశామని, నిర్మలా సీతారామన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో కీలక పదవులు ఇచ్చామని వారు గుర్తు చేస్తున్నారు.