కమీషన్ లు కోసం కాదు ప్రజలు కోసం పనిచేయాలి..

– ఏజెన్సీలో గిరిజనుల పక్షమే వహించాలి….
– ఆరునెలల్లో నే అధికార పార్టీ ఇంత అసంతృప్తి ఏమిటి?
– విలేకర్లు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేసినా ప్రజల సంక్షేమం కోసం,రాష్ట్ర పురోభివృద్ధి కోసమే పనిచేయాలని కానీ అభివృద్ధి పథకాలు పేరుతో కమీషన్ లు కోసం పని చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను విస్మరిస్తుందని ఆరోపించారు.కేవలం ఆరు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. స్థానిక ఓ లాడ్జి ప్రాంగణంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభివృద్ది, సంక్షేమ పథకాలు కే అధిక ప్రాధాన్యత నిచ్చింది అని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని,కేసీఆర్ ప్రభుత్వంతో బేరీజు. వేసుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని,ఆనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది అని,ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసమే పని ప్రజా నాయకుడిగా గుర్తింపు ఉంటుందని సూచించారు.అలా కాకుండా కమీషన్ల కోసం పని చేస్తే కాల గర్భంలో కలిసి పోతారని ధ్వజమెత్తారు.ప్రజా పాలకుడు,మాజీ సీఎం కేసీఆర్ పార్టీని ఓడించిన ఓటర్లు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు.గిరిజన నియోజకవర్గమైన అశ్వారావుపేట అభివృద్ధికి అడిగిన వెంటనే కేసీఆర్ సొంత నియోజకవర్గంగా భావించి నిధులు విడుదల చేశారని, ఆయన తోడ్పాటుతో నే కేవలం రెండేళ్ళలో రూ.800 కోట్లకు పైగా అభివృద్ధి చేసినట్లు వివరించారు.
90 శాతం పనులను పూర్తి చేశానని తన పనితీరును వివరించారు. టీడీపీ నుండి గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉనికి కోల్పోయినా మూడేళ్ళు పని చేశారని, కానీ ఓటర్ల సూచనల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరానని,కేసీఆర్ కూడా ‘అశ్వారావుపేట’ అభివృద్ధికి ఇచ్చిన స్పష్టమైన హమీ మేరకు నిదులు మంజూరు చేసి ప్రోత్సాహించారని సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ కాబోయే సీఎం కేసీఆర్ అని ఆయన జోస్యం చెప్పాడు. కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గానికి మంజూరు చేసిన అభివృద్ధి పనులను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేను ఆయన డిమాండ్ చేశారు. మా ప్రభుత్వంలో మంజూరు కాలేదని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు సెంట్రల్ లైటింగ్, తారు, సీపీ రోడ్లను పూర్తి చేయకుండా ఇప్పటి ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి అవలంభిస్తుందని, ఇవి ఏమాత్రం మంచి పద్దతి కాదని హితవు పలికారు.పదవుల కోసమో.. ఆస్తులు కాపాడుకోవటానికి పార్టీ మారే నేతలను పట్టించుకోరని, పార్టీకి బలమైన కార్యకర్తలే పునాది అని అన్నారు. వారికి ఏ కష్టమొచ్చినా పలికే విధంగా అందుబాటులో ఉంటామని హమీ ఇచ్చారు.ఓటమితో కృంగిపోకుండా ప్రజల్లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కొద్ది రోజులు క్రితం కలిసినప్పుడు మాజీ సీఎం పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని, ఆయన అడుగు జాడల్లో నే రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని పేర్కోన్నారు.తాను గత ఎన్నికల్లో గెలిచి ఉంటే అశ్వారావుపేట మండలం వినాయకపురం, దమ్మపేట మండలం పట్వారీ గూడెం గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయటంతో పాటు ఆశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీ మున్సిపాలిటీ అయ్యేదని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరితమైన వాగ్దానాలు తోనే మార్పు చూడాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు ఆ పార్టీని గెలిపించారని, కానీ బీఆర్ఎస్ ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని అన్నారు.సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని పార్టీ క్యాడర్, ప్రజలను కోరారు. తెలంగాణకు కేసీఆర్ తోనే భవిష్యత్ ఆని, ఆయన ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతారని పునరుద్ఘాటించారు. సమావేశంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి,మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణారావు,పట్టణ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, బీఆర్ఎస్ నాయకులు తాడేపల్లి రవి, కాసాని చంద్ర మోహన్, హుస్సేన్, రఘురాం, తదితరులు పాల్గొన్నారు.